Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రంలో బీజేపీని ఆనవాళ్లు లేకుండా తరిమికొట్టాలి:  కొప్పుల ఈశ్వ‌ర్

కేంద్ర ప్ర‌భుత్వంపై తెరాస‌ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీజేపీ ప్ర‌భుత్వం ప‌ట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింద‌ని కొప్పుల ఈశ్వ‌ర్ విరుచుకుపడ్డారు.
 

Koppula Eshwar fire o BJP
Author
Hyderabad, First Published Aug 24, 2022, 10:37 PM IST

బీజేపీ అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుంద‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ విమ‌ర్శించారు. అధికార బీజేపీ ప్ర‌జ‌ల‌కు మంచి చేయ‌డం మానివేసి..  ప్రజలను దోచుకోవ‌డ‌మే త‌న‌ ప్రధాన ఎజెండాగా పెట్టుకుంద‌ని ఆరోపించారు. బీజేపీ పేదల మనుగడను ప్ర‌శ్నార్థ‌కంగా మారుస్తుంద‌ని, కేంద్ర ప్ర‌భుత్వం ప‌ట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కొప్పుల ఈశ్వ‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

తెలంగాణ‌లో జ‌రుగుతున్న‌ అభివృద్ధి, తెరాస ప్రభుత్వం చేప‌ట్టిన‌ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చూసి ఓర్వలేని కేంద్రం ప్ర‌భుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, వారి కుటుంబ సభ్యులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిప‌డ్డారు. 

బీజేపీ ప్ర‌భుత్వం ధరలు విపరీతంగా పెంచుతూ.. పేద‌వాడిని రోడ్డుపై ప‌డేస్తుంద‌ని,  దేశాన్ని అధోగతి పాలు చేస్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంట్లో దొంగ‌లు ప‌డితే.. ఇంట్లో స‌భ్యులంతా ఒక్క‌టై.. దొంగ‌ను ఎలా త‌రిమి కొడుతారో.. అలాగే.. తెలంగాణ ప్ర‌జ‌ల‌మంతా ఒక్క‌టై.. సీఎం కేసీఆర్‌ను బలపరుస్తూ.. రాష్ట్రంలో బీజేపీ ఆనవాళ్లు లేకుండా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

ప్ర‌శాంతంగా ఉన్న రాష్ట్రంలో బీజేపీ నాయకులు మ‌త‌విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నార‌ని, పేదల క‌డుపులు కొట్టి.. పెద్దోళ్లకు పెడుతున్నార‌ని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న బంగారు తెలంగాణలో బీజేపీ నాయ‌కులు   కలుపు మొక్కలుగా త‌యారు అయ్యార‌ని మండిప‌డ్డారు. ఈ విష‌యాన్ని తెలంగాణ ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ సూచించారు.

తెలంగాణలో  రైతాంగానికి 24గంటల నాణ్యమైన  కరెంటును ఉచితంగా సరఫరా చేస్తుంటే.. కేంద్రంలోని బిజెపి పాలకులు .. సీఎం కేసీఆర్ ను ఇరికాటంలో పెట్టాలని తెగప్రయత్నం చేస్తూ.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతుండడం శోచనీయమ‌ని అన్నారు. 

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చెందుతుంటే..  ప్రోత్సహించాల్సింది పోయి ఇబ్బందులకు గురిచేస్తున్నార‌ని ఆరోపించారు. ఒకప్పటి  బీజేపీ క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేదనీ.. కానీ, ఆ ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింద‌నీ, గతి తప్పి అల్లరి చిల్లర బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కేరాఫ్ గా మారింద‌ని ఆరోపించారు. బిజెపి నాయకులు చేస్తునటువంటి వ్యాఖ్యల్ని, రాజకీయాలు గ‌తంలో ఎప్పుడు చూడ‌లేద‌ని అన్నారు. 

ఎమ్మెల్సీ కవితపై నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని, ఇంటిపై దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆరోపణల్ని వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో జెడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత,వైస్ ఛైర్మన్ హరిచరణ్, డిసిఎంఎస్ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios