Asianet News TeluguAsianet News Telugu

బాబుకు షాక్: బీజేపీలోకి మరో కీలక నేత, అమిత్ షాతో భేటీ

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ నేత కోనేరు చిన్ని బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఇప్పటికే ఆయన అమిత్ షా తో భేటీ అయ్యారు.

koneru chinni likely to join in bjp
Author
Hyderabad, First Published Aug 4, 2019, 3:58 PM IST

ఖమ్మం: తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు కమల నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కేంద్రీకరించింది. ఈ జిల్లాకు చెందిన పలువురు నేతలకు బీజేపీ నాయకత్వం గాలం వేస్తోంది.టీడీపీకి చెందిన నేతలకు బీజేపీ నేతలు వల వేస్తున్నారు.టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని బీజేపీ తీర్థం పుచ్చుకొనే అవకాశం ఉంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. భద్రాద్రి జిల్లాకు చెందిన పలు పార్టీల నేతలతో బీజేపీ నాయకత్వం చర్చించినట్టు సమాచారం. ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కోనేరు చిన్నికి కాషాయదళం వల వేసింది.

ఇటీవల  హైద్రాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ అమిత్ షా వచ్చిన సమయంలో కోనేరు చిన్ని ఆయనతో భేటీ అయ్యారు. ఆగష్టు రెండో వారంలో కోనేరు చిన్ని బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నాడు.

2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌లో చేరాలని  సీఎం కేసీఆర్ కోనేరు చిన్నిని ఆహ్వానించారు. కానీ, ఆయన టీడీపీలోనే కొనసాగారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కూడ కోనేరు చిన్నిని టీఆర్ఎస్ లో చేర్పించేందుకు ప్రయత్నించారు. కానీ, కోనేరు చిన్ని మాత్రం టీడీపీలోనే ఉన్నారు.

కొత్తగూడెం నుండి ప్రజాకూటమి తరపున కాంగ్రెస్ అభ్యర్ధి వనమా వెంకటేశ్వరరావు గెలుపు కోసం కోనేరు చిన్ని మద్దతు ప్రకటించారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు టీడీపీలో ఉన్న సమయంలో  కోనేరు చిన్ని నామా నాగేశ్వర్ రావు వర్గంగా ఉండేవాడు. 2014 ఎన్నికల సమయంలో కోనేరు చిన్నికి కొత్తగూడెం టీడీపీ టిక్కెట్టు ఇవ్వడంలో నామా నాగేశ్వర్ రావు కీలక పాత్ర పోషించారు.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్  ఎన్నికల సమయంలో నామా నాగేశ్వర్ రావు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. నామా నాగేశ్వర్ రావు టీఆర్ఎస్ లో చేరిన సమయంలో కూడ కోనేరు చిన్ని  టీడీపీలోనే కొనసాగారు.

ఖమ్మం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్ధులతో కోనేరు చిన్ని మంతనాలు జరుపుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. వీరందరితో కలిసి కోనేరు చిన్ని బీజేపీలో చేరే అవకాశం ఉంది. తనతో పాటు వీరిందరిని బీజేపీలో చేర్పించేందుకు కోనేరు చిన్ని చర్చలు జరుపుతున్నారని సమాచారం.


 

Follow Us:
Download App:
  • android
  • ios