తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామి దేవాలయ ఘాటు రోడ్డు పై ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న జగిత్యాల డిపోకు చెందిన ఓ ఆర్టీసి బస్సు అదుపుతప్పి ఘాట్ రోడ్డుపై నుండి లోయలోకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 55 మంది ప్రయాణికులు మరణించగా మరో 30 మంది తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ ఘోర ప్రమాదంలో ఆర్టీసి డ్రైవర్ శ్రీనివాస్ కూడా మృతి చెందారు. గత ఆగస్ట్ 15 వ తేదీన జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఇతడు ఆర్టీసి అందించే ఉత్తమ డ్రైవర్ అవార్డును అందుకున్నాడు. అలాంటిది ఇతడు డ్రైవింగ్ లోనే  బస్సు ప్రమాదానికి గురయ్యింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇంత మంది ప్రాణాలను బలితీసుకున్న ప్రమాదానికి గల కారణాలను కనుక్కోడానికి విచారణ చేపట్టింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో జగిత్యాల ఆర్టీసి డిపో మేనేజర్ హన్మంతరావుపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.