టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరంగల్‌లో మంగళవారం నిర్వహించిన సభలో మాట్లాడిన కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరంగల్‌లో మంగళవారం నిర్వహించిన సభలో మాట్లాడిన కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ తూర్పునియోజకవర్గంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే వరంగల్ పై పడి దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి వరంగల్ వచ్చారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు భయం పట్టుకుందని విమర్శించారు. కేసీఆర్‌కు తొత్తుగా వ్యవహరించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు.. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఇరికించారని ఆరోపించారు.
అదే సమయంలో పాలకుర్తిలో పోటీపై కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాలకుర్తిలో రేవంత్ రెడ్డి పోటీ చేయాలని.. లేకుంటే తాము పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లిని ఓడించాల్సిందేనని అన్నారు. ఆనాడూ వైఎస్ రాజశేఖరరెడ్డిని విశ్వసించినంతగా.. నేడు రేవంత్ రెడ్డిని విశ్వసిస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డితోనే ఇందిరమ్మ పాలన సాధ్యం అని అన్నారు. రేవంత్ రెడ్డిని సీఎంగా చూడాలని ఆకాంక్షించారు. అయితే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తమ హయాంలోనే అభివృద్ది జరిగిందని అన్నారు.
కొండా సురేఖ ఈ రకమైన కామెంట్స్ చేయడం ద్వారా వారి కుటుంబం నుంచి ఎవరో ఒకరు పాలకుర్తి నుంచి బరిలో నిలిచేందుకు సిద్దంగా ఉన్నారని సంకేతాలు పంపారు. అయితే ఈసారి కొండా సురేఖ.. వరంగల్ ఈస్ట్ నుంచి బరిలో నిలుస్తారనే ప్రచారం సాగుతున్నందన.. పాలకుర్తి నుంచి ఆమె భర్త మురళీని బరిలో ఉంచాలని ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి కాంగ్రెస్ పార్టీ టికెట్స్ ఇస్తుందా? లేదా? అనేది కూడా వేచిచూడాల్సి ఉంటుంది. మరోవైపు రేవంత్ యాత్రతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. పాలకుర్తి నియోజకవర్గంలో పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్‌పై కొండా మురళిని రంగంలో దింపేలా రేవంత్ ప్రణాళికలు రచిస్తున్నారనే చర్చ కొంతకాలంగా సాగుతుంది. ఎర్రబెల్లి, కొండా మురళిలు.. 1991 వరకు రాజకీయాలలో పరస్పరం సహకరించుకునే స్నేహితులు. ఆ తర్వాత విడిపోయి ఇప్పుడు ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో బద్ద ప్రత్యర్థులుగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించటం కోసం బలమైన ప్రత్యర్థిని రంగంలోకి దించాలనే ఉద్దేశంతో రేవంత్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎర్రబెల్లి రాజకీయంగా బద్ధ శత్రువు అయిన కొండా మురళిని పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయించే ఆలోచనకు వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.
పాలకుర్తి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. కొండా మురళి సామాజికవర్గం మున్నూరుకాపు, ఆయన భార్య కొండా సురేఖ సామాజిక వర్గం పద్మాశాలి. ఇద్దరూ బీసీ నేతలే కావడంతో మురళి బరిలోకి దిగితే రెండు వర్గాలకు చెందిన ఓట్లు మురళికి దక్కే అవకాశం ఉందని రేవంత్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో పాలకుర్తి నుంచి ఎర్రబెల్లిపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జంగా రాఘవరెడ్డి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఆయనను కాదని.. అక్కడి నుంచి కొండా మురళిని బరిలో దింపాలని రేవంత్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. జంగా రాఘవరెడ్డి.. కొండ మురళి శిష్యుడు కావడంతో ఈ నిర్ణయంలో పెద్దగా వ్యతిరేకత ఉండకపోవచ్చనే ఆలోచనలో రేవంత్ ఉన్నారు.
