వరంగల్: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అడ్రస్‌ లేకుండా పోతుందని ఎమ్మెల్సీ కొండా మురళీ జోస్యం చెప్పారు. పరకాల నియోకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కొండా మురళీ తన సతీమణి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొండా సురేఖకు మద్దతుగా ప్రచారం చేశారు. 

తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి అవకాశం ఇస్తే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా కేసీఆర్ వ్యవహరించారని ఆయన తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. పరకాల నియోజకవర్గంలో చల్లా ధర్మారెడ్డి అసమర్థుడంటూ విరుచుకుపడ్డారు. గ్రామాలను అభివృద్ధి చెయ్యలేని ఆయన్ను ప్రజలు నిలదీస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.  

పరకాల నియోజకవర్గంలో నెలకొన్న అన్ని సమస్యలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తుందని కొండా మురళీ హామీ ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను టీఆర్‌ఎస్‌ కాపీ కొట్టిందన్నారు. 

అయినా నమ్మేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చే హామిలన్నీ నెరవేర్చుతుందని, ప్రజలు కూడా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు కొండా మురళీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.