హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ప్రజాతీర్పును గౌరవిస్తానన్నారు. తనకు పదవి లేకపోయినా ప్రజా సేవ చేస్తానని చెప్పుకొచ్చారు. 

ఎన్నికల ఫలితాల అనంతరం తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలను చూసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తనను నాలుగు సార్లు గెలిపించిన ప్రతీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. తన ఓటమిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కోసం తానున్నానని ఎవరూ బాధపడొద్దన్నారు. అయితే ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ బంధువు రవీందర్ రావు ద్వారా నల్గొండలో కోట్ల రూపాయలు కుమ్మరించారని ఆరోపించారు. 

నల్గొండను దత్తత తీసుకుని అభివృద్ధి చెయ్యాలని సీఎం కేసీఆర్ ను రెండు చేతులు జోడించి అడుగుతున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు. నల్గొండ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. 

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేశారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరాజయం పాలయ్యారు.