హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులతో నష్టపోయామని ఆరోపించారు.  ఇతర పార్టీలతో పొత్తులు వద్దని తాను చెప్పినా వినలేదన్నారు. 

ముఖ్యంగా తెలంగాణలో టీడీపీతో పొత్తు అంటే అసలే వద్దని తాను చెప్పినట్లు గుర్తు చేశారు. తెలంగాణలో టీడీపీ కేడర్ నామ మాత్రం అయ్యిందని చెప్పారు. టీడీపీతో పొత్తు వల్ల ఉద్యోగులు, యువత కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని తెలిపారు. 

ప్రజాకూటమి గెలిస్తే చంద్రబాబుకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాటల్ని ప్రజలు బలంగా నమ్మారని చెప్పుకొచ్చారు. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 45 సీట్లు గెలుస్తుందని ఊహించానని అయితే పొత్తుల వల్ల ఘోరంగా ఓడిపోయామన్నారు. 

పార్లమెంట్ ఎన్నికల్లో ఇక పొత్తులు వద్దని చెప్పానన్నారు. పొత్తు లేకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడు పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటుంందని ధీమా వ్యక్తం చేశారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో తాను నల్గొండ నుంచి పోటీ చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. 

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ముందస్తు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావిస్తున్నారు.