కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఢిల్లీకి రావాలని పార్టీ హైకమాండ్ నుంచి ఫోన్ వచ్చింది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రియాంక గాంధీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇటీవల టీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో ప్రియాంక గాంధీ సమావేశమైన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక, పార్టీలో అంతర్గత విబేధాలపై ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ టీ కాంగ్రెస్ నేతలతో చర్చించారు. ఈ భేటీ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం ఉన్నప్పటికీ.. ఆయన హాజరుకాలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాల నేపథ్యంలో ఆయన భేటీకి హాజరుకాలేదని సమాచారు. అయితే తాజాగా ఢిల్లీకి రావాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఫోన్ వచ్చింది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రియాంక గాంధీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది.
మరోవైపు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బుజ్జగించే అవకాశం ఉంది. ప్రియాంకతో భేటీలో రేవంత్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విభేదాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి వెంకట్ రెడ్డితో ప్రియాంక గాంధీ చర్చించే అవకాశం ఉంది. అభ్యర్థి ఎంపిక విషయంలో ఆయన అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. కూడా చర్చ రేవంత్ చేసిన హోంగార్డు కామెంట్స్, చండూరు సభలో చేసిన కామెంట్స్‌కు సంబంధించి అద్దంకి దయాకర్‌పై చర్యలు, పార్టీలో సీనియర్లను పట్టించుకోకపోవడం, పార్టీలో చెరుకు సుధాకర్ చేరిక తదితర అంశాలను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకెళ్లే అవకావం ఉంది.
ఇక, ఇటీవల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోనియా గాంధీకి రాసిన లేఖలో కూడా.. రేవంత్‌రెడ్డి తనను అవమాన పరుస్తున్నారంటూ ప్రస్తావించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనను అవమానిస్తున్నందున అతనితో కలిసి సమావేశంలో పాల్గొనడం తనకు ఇష్టం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు.ఈ కారణంగాన తాను ఇవాాళ జరిగిన సమావేశానికి దూరంగా ఉన్నట్టుగా చెప్పారు. తన నియోజకవర్గంలో ఎలాంటి సమాచారం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పార్టీ పగ్గాలు కమల్‌నాథ్ వంటి సీనియర్లకు అప్పగించాలన్నారు.
రేవంత్‌రెడ్డి తీరు సీనియర్ నాయకులను అవమానించేలా ఉందంటూ వెంకట్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. తన అనుచరులతో అవమానకరంగా మాట్లాడిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తన కుటుంబాన్ని కించపర్చేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని కూడా లేఖలో ప్రస్తావించారు. చండూరు సభ, పార్టీలో చెరుకు సుధాకర్ చేరిక లాంటి అంశాలను లేఖలో ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే.. సోమవారం టీ కాంగ్రెస్ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రియాంక గాంధీ.. పార్టీ పట్ల సానుకూల అవగాహన కల్పించేందుకు ఐక్యంగా, క్రమశిక్షణతో పని చేయాలని వారికి సూచించినట్లు తెలిసింది.
