భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ధాన్యం కొనుగోలు సమస్యకు సంబంధించి సీఎం కేసీఆర్‌కు ఆయన సవాల్ విసిరారు. తనకు గానీ, రేవంత్ రెడ్డికి గానీ ఒక్క ఛాన్స్ ఇస్తే చూపిస్తామన్నారు కోమటిరెడ్డి.
తనకో, రేవంత్‌కో ఒక్కరోజు ఛాన్స్ ఇస్తే.. రైస్ సమస్యని పరిష్కరిస్తామంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం ఆయన రేవంత్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. తాను చనిపోయినప్పుడు మూడు రంగుల జెండా కప్పమని చెప్పానన్నారు. నాది ఒకే మాట, ఒకే బాట అని ఆయన స్పష్టం చేశారు. ప్రధానికి కేసీఆర్ అవినీతిపై పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశానని కోమటిరెడ్డి అన్నారు. అభివృద్ధి కోసం తాను పోరాడుతానని.. బొగ్గు గనుల కుంభకోణంపై కేసీఆర్ సమాధానం చెప్పాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో తనపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. యూపీఏ హయాంలో జరిగిన కోల్ స్కామ్ కంటే ఇది ఇంకా పెద్దదన్నారు.
నైనీ కోల్ మైన్ కాదని.. నైనీ గోల్డ్ మైన్ అంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీతో అవగాహన లేకుండా సింగరేణి సీఎండీని ఎనిమిదేళ్ల పాటు ఎలా కొనసాగిస్తారంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు. దీనిపై చీఫ్ సెక్రటరీ సైతం హైకోర్టును ఆశ్రయించారని ఆయన తెలిపారు. శ్రీధర్ అయితేనే ఇలాంటి స్కామ్‌లు చేయగలుగుతారంటూ కేసీఆర్ ఆయనను కొనసాగిస్తున్నారంటూ కోమటిరెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని.. కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చినవి తప్ప రాష్ట్రంలో కొత్తవి లేవంటూ దుయ్యబట్టారు. రైస్ లేని రాష్ట్రాలకు బియ్యంను అమ్ముకోవచ్చని.. లేదంటే తెల్లరేషన్ కార్డు దారులకు అదనంగా బియ్యంను ఇవ్వొచ్చని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
వీటికి డబ్బులు లేవని.. సెక్రటేరియట్, ప్రగతి భవన్ కట్టడానికి మాత్రం డబ్బులు వున్నాయా అంటూ వెంకట్ రెడ్డి ఫైరయ్యారు. ఫాంహౌస్ చుట్టూ రింగ్ రోడ్డు కట్టించారంటూ ఆరోపించారు. 15 మందికి చెక్కులు ఇచ్చి దళిత బంధును వదిలేశారని మండిపడ్డారు. ఆలేరులో కార్యక్రమం జరిగినప్పుడు తనను పిలవలేదని కోమటిరెడ్డి ఫైరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఆలేరు, భువనగిరిలలో వున్న ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందడం లేదని ఆయన ఆరోపించారు.
అనంతరం రేవంత్ రెడ్డి (revanth reddy) మాట్లాడుతూ.. కేసీఆర్ (kcr) ఫ్యామిలీ దోపిడీ చేస్తోందన్నారు . కేసీఆర్ ఫ్యామిలీని జైలుకు పంపుతామని బీజేపీ (bjp) నేతలు చెబుతున్నారంటూ రేవంత్ అన్నారు. సింగరేణికి (singareni) సంబంధించి ఒడిషాలోని బొగ్గు గని టెండర్లు పిలిచారని .. అయితే వాటిని కొన్ని కంపెనీలకు అనుగుణంగా నిబంధనలను అనుగుణంగా నిబంధనలు మార్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదాని కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని అన్నారు. దీనికి సంబంధించి ప్రధాని, హోంమంత్రి, ప్రహ్లాద్ జోషి, కోల్ సెక్రటరీ, సెంట్రల్ విజిలెన్స్ కమీషన్, సీబీఐ, ఇతర విచారణ సంస్థలకు కూడా ఫిర్యాదు చేశామని రేవంత్ చెప్పారు.
టెండర్ల వెనుక కేసీఆర్ గ్యాంగ్ వుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komati reddy venkat reddy) స్వయంగా ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారని చెప్పారు. టెండర్ల నియమ నిబంధనలు కూడా ఓ కంపెనీని దృష్టిలో పెట్టుకుని రూపొందించారని రేవంత్ పేర్కొన్నారు. సింగరేణి సీఎండీగా శ్రీధర్ గత 8 ఏళ్లుగా కొనసాగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అనుమతి లేకుండా ఒక అధికారి ఎలా కొనసాగుతారని రేవంత్ ప్రశ్నించారు. సింగరేణి కుంభకోణంపై సీబీఐ విచారణ చేపట్టకపోతే కోర్టుల్ని ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. కేసీఆర్ దోపిడీని బీజేపీ చూసీచూడనట్లు వ్యవహరిస్తోందన్నారు. బీజేపీకి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల నిధుల్ని కేసీఆర్ సమకూర్చారని రేవంత్ ఆరోపించారు.
