నేను ప్రచారం చేసినా ... మునుగోడులో కాంగ్రెస్ ఓటమి ఖాయం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం

మునుగోడు ఉపఎన్నిక ఫలితం కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. రెండు అధికార పార్టీల కొట్లాటలో కాంగ్రెస్ పార్టీ గెలుపు అసాధ్యమంటూ జోస్యం చెప్పారు. 

Komatireddy Venkat Reddy Sensational comments about Munugode Bypoll

హైదరాబాద్ : మునుగోడు ఉపఎన్నిక వేళ టీపిసిసి స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తన సోదరుడు, బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా నిలవాలని... అతడికే ఓటెయ్యాలంటూ మునుగోడు కాంగ్రెస్ నేతను వెంకట్ రెడ్డి కోరినట్లుగా ఓ పోన్ కాల్ రికార్డింగ్ బయటకు వచ్చింది. ఓవైపు ఈ దుమారం కొనసాగుతుండగానే ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో వున్న వెంకట్ రెడ్డి మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓటమి తప్పదంటూ వ్యాఖ్యానించారు.

ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్ గా వుండికూడా మునుగోడు ప్రచారంలో పాల్గొనని భువనగిరి ఎంపీ వెంకట్ రెడ్డి వ్యవహారంపై మండిపడుతున్న కొందరు నాయకులు తాజా వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని అధికార బిజెపి, రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్ఎస్ కు పోటీగా మునుగోడులో ముమ్మర ప్రచారం నిర్వహిస్తూ మునుగోడులో గెలుపుకోసం శాయశక్తులా కష్టపడుతున్న తమ ఉత్సాహాన్ని నీరూగార్చేలా సొంత పార్టీ నేతే వ్యవహరించారంటూ కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. 

Read more సొంత అన్నగా భావించాను.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వైఖరి బాధ కలిగిస్తోంది: పాల్వాయి స్రవంతి

ఆస్ట్రేలియాలో ఎన్నారైలతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు ఉపఎన్నికపై ముచ్చటించారు. ఈ సందర్భంగా... మునుగోడు ఉపఎన్నికలో తాను ప్రచారానికి వెళితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పెరుతాయంతే ... గెలవడం మాత్రం సాధ్యంకాదని పేర్కొన్నారు. అందుకే ఎలాగూ ఓడిపోయే చోట ప్రచారం చేయడం ఎందుకనే తాను మునుగోడు ప్రచారానికి దూరంగా వున్నానని తెలిపారు.  మునుగోడులో రెండు అధికార పార్టీలు కొట్లాడుతున్నాయి... ఇందులో కాంగ్రెస్ పార్టీ పోరాడినా గెలుపు అసాధ్యమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.  

ఇలా ఎన్నికకు ముందే మునుగోడులో కాంగ్రెస్ ఓటమి ఖాయమంటూ వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వెంకట్ రెడ్డి సస్పెండ్ చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు కొందరు అధిష్టానాన్ని కోరుతున్నారు. అలాగే అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టిపిసిసి కి మరికొందరు నాయకులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ మాత్రం చర్యలకు సాహసించడం లేదు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios