రైతులకు ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలపై అధికార  బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

హైదరాబాద్‌: రైతులకు ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలపై అధికార బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. రేవంత్ ఏ సందర్భంలో అలా అన్నారో తెలియదని అన్నారు. ఒకవేళ రేవంత్ ఉచిత కరెంట్ ఇవ్వకూడదని చెబితే అది తప్పేనని అన్నారు. ఉచిత కరెంట్ ఇస్తామని ప్రకటించి దేశంలోనే తొలిసారిగా కాంగ్రెస్ ప్రకటించిందని.. ఈ విషయంలో సోనియాను వైఎస్సార్ ఒప్పించారని.. ఉచిత కరెంట్ ఇచ్చేందుకు చాలా కష్టపడ్డామని చెప్పారు. 

అప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో లేడని.. అప్పుడు ఎంత కష్టపడిందనేది ఆయనకు తెలియదని అన్నారు. బీఆర్ఎస్ ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని కోరారు. రేవంత్ రెడ్డి కూడా తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. రేవంత్ అయినా, తానైనా పార్టీ కో ఆర్డినేటర్లం మాత్రమేనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. మేనిఫెస్టోలో ఇది చేస్తామని చెప్పే అధికారం లేదని చెప్పారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తామని.. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానంతో మాట్లాడి మేనిఫెస్టోలో పెట్టిస్తామని తెలిపారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా తాను ఈ మాట చెబుతున్నానని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటలు రైతులుకు ఉచిత కరెంట్ ఇస్తామని.. బ్రేక్ లేకుండా నాణ్యమైన కరెంట్ అందిస్తామని చెప్పారు. 


ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా సీఎం కావొచ్చనేది జోక్ అని అన్నారు. అమెరికా వెళ్లిన తర్వాత రేవంత్ రెడ్డి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారనేది తెలియదని చెప్పారు. పార్టీ అధిష్టానం సీఎం ఎవరనేది నిర్ణయిస్తుందని తెలిపారు. దళితులు సీఎం ఇవ్వాలని చూసిన దామోదర రాజనర్సింహ, మల్లు భట్టి విక్రమార్క వంటి సీనియర్ నేతల గురించి అధిష్టానం ఆలోచిస్తుందని చెప్పారు. కరెంట్ విషయం రేవంత్ పరిధి కాదని.. అది అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. తాను ఈ విషయాన్ని ఎవరి దృష్టికి తీసుకెళ్లనని.. ఏదైనా ఉంటే అంతర్గత సమావేశంలో మాట్లాడుకుంటామని చెప్పారు.