నల్గొండ: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రభుత్వం షాకిచ్చింది. ఉదయసముద్రం-బ్రహ్మణ వెల్లెంల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఇవాళ్టి నుండి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తలపెట్టిన రైతు సాధన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్రకు బ్రేక్ పడింది.

ఉదయసముద్రం-బ్రహ్మణ వెల్లెంల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయాలంటూ ఈ నెల 26న పాదయాత్ర నిర్వహణకు అనుమతి ఇవ్వాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ నెల 19న డీజీపీ మహేందర్ రెడ్డికి, ఈ నెల 24న రాచకొండ కమిషనరేట్ కు, ఈ నెల 23న నల్గొండ ఎస్పీకి లేఖ రాశారు. అయితే ఈ పాదయాత్రకు అనుమతి విషయంలో ఈ నెల 25వ తేదీన పోలీసులు తమ వైఖరిని ప్రకటించారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్రకు అనుమతి లేదని స్పష్టం చేశారు.ఈ మేరకు నల్గొండ ఎస్పీ రంగనాథ్ ఆదివారం రాత్రి ఓ ప్రకటనను విడుదల చేశారు. హైద్రాబాద్-విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై రోజూ 40 వేల వాహనాలు తిరుగుతాయన్నారు.

ఈ నెల 26వ తేదీన రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ నెల 26,27 తేదీల్లో వెంకట్ రెడ్డి 36 కి.మీ పాదయాత్ర నిర్వహించేందుకు సన్నాహలు చేసినట్టుగా ఎస్పీ చెప్పారు. ఈ పాదయాత్ర కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఎస్పీ అభిప్రాయపడ్డారు.

జాతీయ రహదారిపై పాదయాత్ర కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన గణేష్ చతుర్ధి. గణేష్ చతుర్ధి కావడంతో హైద్రాబాద్ నుండి  నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం , మహబూబాబాద్ తో పాటు ఏపీ సరిహద్దుల్లోని ఇతర ప్రాంతాలకు కూడ విగ్రహలను తరలించే అవకాశం ఉందని ఎస్పీ వివరించారు.

శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీసు సిబ్బంది గణేష్ ఉత్సవాల్లో విధులు నిర్వహణకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఈ కారణంగా కోమటిరెడ్డి పాదయాత్రకు బందోబస్తును కల్పించే పరిస్థితి ఉండదన్నారు. 

ఇదిలా ఉంటే తన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. తాను ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించనున్నట్టు చెప్పారు. పాదయాత్రకు అనుమతించకపోవడం తన స్వేచ్ఛను అనుమతించడమేనని వెంకట్ రెడ్డి చెప్పారు.

బ్రహ్మణ వెల్లెంల నుండి జలసౌధ వరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్ర చేయాలని భావించారు. ఈ ప్రాజెక్టు పనులు పూేర్తి చేయాలనే డిమాండ్ తో పాదయాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు.