హైదరాబాద్: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుల అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని తెగేసి చెప్పారు. 

హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్లే ఓటమిపాలయ్యామని ఆరోపించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో అదే తప్పుచేయోద్దని హితవు పలికారు. 

అలాగే ప్రస్తుతం ఉన్న పీసీసీ టీమ్ తో పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. పీసీసీని ప్రక్షాళన చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. తనకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే 17 పార్లమెంట్ స్థానాలకు గానూ 8 పార్లమెంట్ స్థానాలను గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. 

తాను నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తానని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ తో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదన్నారు. రాజకీయాల పరంగా విబేధాలు ఉండటం సహజమేనని అయితే వ్యక్తిగత వైరం లేదని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.