హైదరాబాద్: పదవుల కోసం తాను ఆరాటపడడం లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి ప్రకటించారు. వారం  రోజుల్లో తాను బీజేపీలో చేరుతున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు.

మంగళవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. రానున్న రోజుల్లో  తెలంగాణ రాష్ట్రంలో బీజేపీదే అధికారమన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని ఆయన అభిప్రాయపడ్డారు.

తాను పార్టీ  వీడకుండా పదవులు ఇచ్చినా కూడ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగే పరిస్థితులు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకొందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. 

తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తన లాంటి వాళ్లు తెలంగాణలో బీజేపీలో చేరితే  ఆ పార్టీ మరింత బలోపేతం కానుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

ఇప్పటికే తాను బీజేపీ అగ్రనేతలను కలిసి చర్చించినట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. కార్యకర్తలంతా తన వెంటే ఉన్నారన్నారు.

షాకాజ్  నోటీసుకు సమాధానం ఇవ్వడం గురించి ఆలోచించలేదన్నారు.  పార్టీ కోసం తాను  చేసిన సూచనలను ఏ మాత్రం పట్టించుకోలేదని  ఆయన మండిపడ్డారు. పైగా తనకే షోకాజ్ నోటీసులు జారీ చేశారని  ఆయన మండిపడ్డారు.