మునుగోడు ఉపఎన్నికలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రజలే తనకు దేవుళ్లని, వాళ్ల తీర్పును శిరసా వహిస్తానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ ఉపఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఎన్నికగా కోమటిరెడ్డి అభివర్ణించారు 

వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తిరుమల శ్రీవారిని ఆయన ఈరోజు సతీసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... మునుగోడు ఉపఎన్నికతో సీఎం కేసీఆర్ పాలనను ప్రజలు అంతం చేయాలని కోరారు. ఈ ఉపఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఎన్నికగా కోమటిరెడ్డి అభివర్ణించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం జరుగుతున్న ఎన్నిక అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా వున్నారని.. కేసీఆర్ కుటుంబ పాలనకు తెరదించాలని రాజగోపాల్ రెడ్డి కోరారు. మునుగోడు ప్రజలే తనకు దేవుళ్లని, వాళ్ల తీర్పును శిరసా వహిస్తానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. 

ALso REad:మునుగోడులో బీజేపీ గెలిస్తే.. నెలరోజుల్లో టీఆర్ఎస్ సర్కార్ కూలడం ఖాయం : రాజగోపాల్ రెడ్డి

ఇక కొద్దిరోజుల క్రితం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో బీజేపీ గెలిస్తే నెల రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుతం దేశం మొత్తం ఈ ఉపఎన్నిక కోసం ఎదురుచూస్తుందని కోమటిరెడ్డి అన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మునుగోడు నియోజకవర్గాన్ని విడిచిపెట్టానని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌లోనే చేరితేనే సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ ఇస్తారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తమ తమ నియోజకవర్గాల్లో వున్న సమస్యలపై కేసీఆర్‌తో మాట్లాడేంత ధైర్యం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లేదని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. 

అంతకుముందు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నికలో ఎవరెన్ని కుట్రలు చేసినా.. సీఎం కేసీఆర్ స్వ‌యంగా వ‌చ్చి పోటీ చేసినా విజయం తనదేనని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కుటుంబసభ్యులు జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడ్డాయని, ఇప్పటికే ఆయన కుమార్తె కవిత లిక్కర్‌ కేసులో దొరికిపోయారన్నారు. రూ.లక్ష కోట్లకు పైగా దోచుకున్న కేసీఆర్‌తో పాటు ఆయన కుమారుడు, అల్లుడిని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా త్వరలో జైలుకు పంపి తీరుతారని హెచ్చరించారు 

అధికార‌ టీఆర్ఎస్ ఇంటికి కిలో బంగారం చొప్పున ఇచ్చినా మునుగోడులో టీఆర్‌ఎస్ గెల‌వ‌డం అసాధ్యమని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని లింగారెడ్డిగూడెంలో శ‌నివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే ఉపఎన్నికలో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ నియంత పాలనను అంతమొందించేందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి... బీజేపీలో చేరిన‌ట్టు తెలిపారు. మునుగోడులో గెలిచేందుకు సీఎం కేసీఆర్ అవినీతి సొమ్ముతో ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.తెలంగాణ‌లో ప్రశ్నించే గొంతు ఉండకుండా, ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ నియంతగా పరిపాలిస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు.