సీఎం కేసీఆర్ మనవడు తినే భోజనమే ఈ పిల్లలకు కూడా పెడుతున్నారా?: మంత్రి సబితాపై రాజగోపాల్ రెడ్డి ఫైర్
హాస్టల్‌లో వడ్డించిన భోజనంలో గాజు ముక్కలు వచ్చాయంటూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. విద్యార్థినిలు ఆందోళన చేపట్టిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
హాస్టల్‌లో వడ్డించిన భోజనంలో గాజు ముక్కలు వచ్చాయంటూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఓయూ లేడీస్ హాస్టల్‌లో రెండు వారాలుగా భోజనం సరిగ్గా ఉండటం లేదని ఆరోపించారు. మెస్ బిల్లులు కట్టినా లిమిటెడ్ గా భోజనం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. విద్యార్థినిలు ఆందోళన చేపట్టిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ మనవడు తినే భోజనమే ఈ పిల్లలకు కూడా పెడుతున్నారా? అని ప్రశ్నించారు.
‘‘అన్నం గడ్డలుగా, గాజు పెంకులు వచ్చిన భోజనం ! ఏం అమ్మ సబితమ్మ.. ఇవి కూడా సిల్లీ రీజన్స్ అవుతాయా? మీ సీఎం మనవడు తినే భోజనమే ఈ పిల్లలకు కూడా పెడుతున్నారా? ’’ అని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షేర్ చేసిన వీడియోలో ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. ‘‘గత రెండు వారాల నుంచి ఫుడ్ సరిగా ఉండడం లేదు. అన్నం గడ్డలు గడ్డలుగా అవుతుంది. నీళ్ల నీళ్ల సాంబారు.. రిపీటెడ్ కర్రీలు. టిఫిన్స్‌లో చట్నీలు అస్సలు బాలేవు. లిమిటెడ్ భోజనం పెడుతున్నారు. నోటిఫికేషన్లు పడటంతో ఎంతో మంది మంచి మంచి జాబ్‌లు రావాలని ప్రిపేర్ అవుతున్నారు. కొంచెం ఫుడ్ ఎక్కువ పెట్టమంటే పెట్టడం లేదు. మీరు అంత తింటారా? ఇంత తింటారా? అని మాట్లాడుతున్నారు. మెస్ బిల్లు కట్టినప్పుడు ఎంత అడిగితే అంత ఫుడ్ పెట్టాలి. లిమిటెడ్ ఫుడ్ ఏమిటి?. అమ్మాయిలు చాలా బలంగా ఉండాలి. అబ్బాయిల కంటే అమ్మాయిలే బలంగా ఉండాలి అని పేరుకే కొటేషన్స్ చెప్తారు.
పేరుకే ఇలాంటి మాటలు మాట్లాడతారా?.. ఎంత ఫుడ్ పెట్టాలో కూడా తెలియదా?. మేము గాజు పెంకులొచ్చిన ఫుడ్ తిన్నాం. మాకేమైనా అయితే అధికారులే బాధ్యత వహించాలి. అది సీఎం అయినా, వీసీ అయినా సరే.. ఎవరనేది నాకు అవసరం లేదు. పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకొని మమ్మల్ని ఇక్కడికి పంపిస్తే.. ఇలాంటి ఫుడ్ తినాలా?. మా భోజనంలో గాజు పెంకులొచ్చాయి.. కొంత ఫుడ్ తిన్నాక కనిపించాయి. అంతకుముందే అవి లోపలికి వెళ్లుంటే మీరే బాధ్యులు’’ అని చెప్పారు.