నల్గొండ:పీసీసీ పగ్గాలు తనకు అప్పగిస్తే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  వంద సీట్లలో  కాంగ్రెస్ పార్టీని గెలిపించేవాడినని  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ప్రకటించారు.  అయితే ఈ ఎన్నికల్లో తన సోదరుడు ఓటమి పాలు కావడం తనను చాలా బాధకు గురి చేసిందన్నారు.

శనివారం నాడు  ఆయన  కాంగ్రెస్ పార్టీ మునుగోడు  నియోజకవర్గ నియోజకవర్గ  కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.  ఎన్నికల ముందు పొత్తు పేరుతో  ఆలస్యం చేయడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని   ఆయన అభిప్రాయపడ్డారు.   

బలం లేకున్నా కూడ  మిత్రపక్షాలకు ఎక్కువ సీట్లను కేటాయించడం కూడ ఓటమికి కారణమైందని ఆయన  చెప్పారు. తెలంగాణ సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తన సోదరుడు వెంకట్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన చెప్పారు.  

కార్యకర్తలందరికీ కూడ తాను అందుబాటులో ఉంటానని ఆయన ప్రకటించారు. పంచాయితీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేయాలని  రాజగోపాల్ రెడ్డి సూచించారు. వ్యక్తిత్వమే ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములను ప్రభావితం  చేస్తోందన్నారు. ప్రతి గ్రామంలో సర్పంచ్, వార్డుసభ్యులను గెలిపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు.