ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మంగళవారం అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ పోచారంకు అందజేశారు.
మునుగోడ ఉప ఎన్నిక ఓ వ్యక్తి కోసం, పార్టీ కోసం కాదని.. తెలంగాణ భవిష్యత్తు కోసమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. సోమవారం అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ పోచారంకు అందజేశారు. అంతకుముందు గన్ పార్క్ వద్దకు చేరుకున్న రాజగోపాల్ రెడ్డి.. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా రాజీనామ చేస్తున్నట్టుగా చెప్పారు.
సబ్బండ వర్గాలు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చిందని తెలిపారు. ప్రజలు ఆత్మగౌరవం కోరుకుంటున్నారని చెప్పారు. నేడు తెలంగాణలో కేసిఆర్ కుటుంబం అరాచక పాలన సాగిస్తుందని ఆరోపించారు. తాను రాజీనామా అనగానే.. కేసీఆర్‌కు మునుగోడు గుర్తుకు వచ్చిందని అన్నారు. ప్రభుత్వంపై ధర్మయుద్దం ప్రారంభించానని.. ఈ ధర్మ యుద్దంలో మునుగోడు ప్రజలు గెలుస్తారని చెప్పారు. తన రాజీనామాతో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు కేసీఆర్ నుంచి విముక్తి కల్పిస్తాని అన్నారు. తనను గెలిపించి ప్రజలు పాపం చేశారా అని ప్రశ్నించారు.
అభివృద్ది కోసం కేసీఆర్ ను కలువలని చూస్తే అపాయింట్ మెంట్ ఇవ్వలేదని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికపై ప్రజలు మాట్లాడుకుంటున్నారని తెలిపారు. అసలు.. ఎందుకు ఉప ఎన్నిక వస్తోందని చర్చ జరుగుతుందన్నారు. తనకు స్వార్థం ఉంటే ఉప ఎన్నిక కోరుకోనని చెప్పారు. తన మునుగోడు ప్రజల పై ఉన్న నమ్మకం తో రాజీనామ చేసి తీర్పు కోరానని తెలిపారు. దైర్యం లేకపోతే తాను ఈ పని చేసేవాడిని కాదని చెప్పారు. తనపై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇది తనకోసం చేసే యుద్దం కాదని.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు. నిరుద్యోగులు, ప్రజలకు వైద్యం కోసం, పేదలకు ఇళ్ల కోసం, పెన్షన్‌ల కోసం తాను రాజీనామా చేస్తున్నట్టుగా తెలిపారు. తాను రాజీనామ అనగానే గట్టుప్పల్ మండలం వచ్చిందని చెప్పారు.
సీఎంకు సిరిసిల్ల సిద్దిపేట, గజ్వేల్ తప్ప ఇతరులు కనిపించడం లేదని మండిపడ్డారు. ప్రాజెక్టులు కట్టొద్దని తాము చెప్పలేదని అన్నారు. రూ. లక్ష రుణ మాఫీ ఏమైందని ప్రశ్నించారు. మిషన్ భగీరథలో 25వేల కోట్లు దోచుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. జీతాలు ఇవ్వాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని ఆరోపించారు. గంగుల, ఎర్రబెల్లి, తలసాని, పువ్వాడ అజయ్ ఉద్యమకారులా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజా స్వామ్యం లేదని అన్నారు. స్పీకర్ తన రాజీనామ ఆమోదిస్తారు అనుకుంటున్నానని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడి మాటలు, భాష విన్న తర్వాత సభ్య సమాజం తలదించుకుంటుందని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు, ఆయన అనుచరులు వాడుతున్న అసభ్య పదజాలం వింటున్న యువకులు, మేదావులు బాధపడుతున్నారని చెప్పారు.
