మునుగోడు ఉపఎన్నికలో ఎవరెన్ని కుట్రలు చేసినా.. సీఎం కేసీఆర్ స్వ‌యంగా వ‌చ్చి పోటీ చేసినా విజయం తనదేనని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. 

మునుగోడు ఉపఎన్నికలో ఎవరెన్ని కుట్రలు చేసినా.. సీఎం కేసీఆర్ స్వ‌యంగా వ‌చ్చి పోటీ చేసినా విజయం తనదేనని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్‌ కుటుంబసభ్యులు జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడ్డాయని, ఇప్పటికే ఆయన కుమార్తె కవిత లిక్కర్‌ కేసులో దొరికిపోయారన్నారు. రూ.లక్ష కోట్లకు పైగా దోచుకున్న కేసీఆర్‌తో పాటు ఆయన కుమారుడు, అల్లుడిని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా త్వరలో జైలుకు పంపి తీరుతారని హెచ్చరించారు 

అధికార‌ టీఆర్ఎస్ ఇంటికి కిలో బంగారం చొప్పున ఇచ్చినా మునుగోడులో టీఆర్‌ఎస్ గెల‌వ‌డం అసాధ్యమని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని లింగారెడ్డిగూడెంలో శ‌నివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే ఉపఎన్నికలో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ నియంత పాలనను అంతమొందించేందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి... బీజేపీలో చేరిన‌ట్టు తెలిపారు. మునుగోడులో గెలిచేందుకు సీఎం కేసీఆర్ అవినీతి సొమ్ముతో ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.తెలంగాణ‌లో ప్రశ్నించే గొంతు ఉండకుండా, ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ నియంతగా పరిపాలిస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. 

కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతం చేయడానికి మునుగోడు ఉప ఎన్నిక వ‌చ్చింద‌నీ, తెలంగాణలో మరో మలిదశ ఉద్యమం నుంచి ప్రారంభమైంద‌ని అన్నారు. మునుగోడు నుంచే కేసీఆర్ నియంతృత్వ‌ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఈ ఉపఎన్నికల్లో గెలిచినా.. టీఆర్ ఎస్ వ‌ల్ల‌ ఓడినా చచ్చేవరకు మునుగోడును వదిలే ప్రస్తకే లేదని స్ప‌ష్టం చేశారు. పదవులు శాశ్వతం కాదని.. ప్రజా సేవ చేయడమే ముఖ్య‌మ‌న్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో సంపాదించిన అవినీతి సొమ్ముతో మునుగోడు ఓటర్లను కొనే ప్రయత్నం చేస్తున్నార‌ని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ప్రజలు చాలా చైతన్యం కలిగిన వారని... కేసీఆర్ గిమ్మిక్కులకు వారు పడిపోరని అన్నారు.సీఎం కేసీఆర్ లో ఓటమి భయం ప్రారంభ‌మైంద‌ని అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలనను తరిమికొట్టడానికి చేస్తున్న ధర్మయుద్ధంలో విజయం మునుగోడు ప్రజలదేనని చెప్పారు. మునుగోడు ప్ర‌జ‌లు ఇచ్చే తీర్పుతోనే తెలంగాణ భవిష్యత్తు ఆధారపడుతుందని అన్నారు. 

నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చిన సీఎంకేసీఆర్ చేసిందేమీ లేదని, కేవలం గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేటల్లోనే అభివృద్ది జ‌రిగింద‌నీ, తెలంగాణ అంటే.. ఆ మూడు జిల్లాలేనా అని ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ ను ఓడించడం బీజేపీకే సాధ్యమని... అందుకే బీజేపీలో చేరానని చెప్పారు. తన రాజీనామాతో మునుగోడులో సునామీ వచ్చిందని అన్నారు. మరోవైపు బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. చౌటుప్పల్ జెడ్పీటీసీ సభ్యుడు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు, నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లు, పలువురు ఎంపీటీసీ సభ్యులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు బీజేపీలో చేరారు.