12 మంది ఎమ్మెల్యేలు జంప్.. నేను సీఎల్పీగా వుంటే, ప్రజల ఫీడ్‌బ్యాక్‌తోనే నా రాజీనామా : తేల్చేసిన రాజగోపాల్ రెడ్
రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని.. ఇక భవిష్యత్ అంతా బీజేపీదేనన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌తోనే రాజీనామాపై నిర్ణయం తీసుకుందామని ఆయన అన్నారు
పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చేసిన కాంగ్రెస్ (congress) ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (komatireddy raja gopal reddy) హైదరాబాద్‌లో ముఖ్య అనుచరులతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో తనకు ఘోర అవమానం జరిగిందన్నారు. తెలంగాణ కోసం పోరాడినోళ్లను పక్కనబెట్టి , ద్రోహులకు పదవులివ్వడం ఆవేదన కలిగించిందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ హవాలోనూ మునుగోడులో ఘన విజయం సాధించానని ఆయన గుర్తుచేశారు. టీఆర్ఎస్ అధికారంలో వున్నా ఎమ్మెల్సీగా గెలిచానని.. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడినా హైకమాండ్‌లో చలనం లేదని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను సీఎల్పీ పదవిలో వుంటే ఎమ్మెల్యేలను కాపాడుకునేవాడినని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని.. ఇక భవిష్యత్ అంతా బీజేపీదేనని (bjp) రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదని గెలిచినోళ్లు ఆ పార్టీలో వుంటారని గ్యారెంటీ లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి రాజీనామా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాజగోపాల్ రెడ్డి తన అనుచరులకు తెలియజేశారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌తోనే నిర్ణయం తీసుకుందామని ఆయన అన్నారు. మూడున్నరేళ్లుగా మునుగోడు అభివృద్ధి చేయలేకపోయామని... ఉప ఎన్నిక వస్తేనైనా ప్రజలకు మేలు జరుగుతుందంటే రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌తోనే తన కొట్లాట అని ఆయన మరోసారి తేల్చి చెప్పారు.
Also Read:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నచ్చజెబుతాం.. ఆయన కాంగ్రెస్‌ను వీడరు : భట్టి విక్రమార్క
మరోవైపు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై చర్చించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కేసీ వేణుగోపాల్ ఇంటికి చేరుకున్నారు. భేటీ ముగిసిన అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ... రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చించామన్నారు . కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోనే వున్నారని... బండి సంజయ్‌కి రాజకీయ అవగాహన లేదని దుయ్యబట్టారు. బండి ఉన్మాదిలా నోటికొస్తే అది మాట్లాడుతున్నారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఏమైనా ఇబ్బంది ఉంటే మాట్లాడి పార్టీలోనే ఉండేట్లు చూస్తామని భట్టి హామీ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్, సోనియా అంటే అభిమానం వుందన్నారు.