Asianet News TeluguAsianet News Telugu

మునుగోడులో నైతిక విజయం నాదే.. టీఆర్ఎస్ అధర్మంగా గెలిచినట్టే: రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్

మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టుగా  బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసి తనను ప్రచారం కూడా చేయనివ్వలేదని ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్ అధర్మంగా గెలిచినట్టేనని విమర్శించారు.

Komatireddy Raj Gopal Reddy Comments On Munugode Bypoll Result
Author
First Published Nov 6, 2022, 4:34 PM IST

మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టుగా  బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసి తనను ప్రచారం కూడా చేయనివ్వలేదని ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్ అధర్మంగా గెలిచినట్టేనని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కేంద్రం వెలుపల రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. భారత దేశ చరిత్రలో ఎన్నికల మధ్యలో రిటర్నింగ్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేయడం మొట్టమొదటి  సారిగా మునుగోడులోనే జరిగిందన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లు ఒత్తిడి తీసుకొచ్చి రిటర్నింగ్ అధికారితో తప్పులు చేయిస్తే.. ఎన్నికల సంఘం సస్పెండ్ చేయడం జరిగిందని అన్నారు. పోలీసులు ఏక పక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. నవంబర్ 3వ తేదీ సాయంత్రం వరకు బయటి ప్రాంతాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు మునుగోడులోనే ఉండి.. ఓటర్లను ప్రలోభ పెట్టినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. మునుగోడులో కేసీఆర్ అవినీతి సొమ్ముతో మద్యం ఏరులై పారించారని విమర్శించారు.పోలీసు వ్యవస్థను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

టీఆర్ఎస్ పార్టీ అడ్డదారుల్లో అధర్మంగా గెలించిందని విమర్శించారు. అక్టోబర్ 31వ తేదీ వరకు మునుగోడులో బీజేపీ ముందంజలో ఉందన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి నవంబర్ 1వ తేదీన కూడా బయటి ప్రాంతాల నుంచి వచ్చిన టీఆర్ఎస్ నాయకులు మునుగోడులోనే ఉండి.. డబ్బులు పంచి, బెదిరింపులకు పాల్పడ్డారని విమర్శించారు. తెలంగాణలో నియంత పాలనకు చరమగీతం  పాడాలంటే మోదీ, అమిత్ షాలతోనే సాధ్యం అని మునుగోడు ప్రజలు నిరూపించారని.. కానీ ప్రలోభాలతో టీఆర్ఎస్ కొద్దిపాటి మెజారిటీతో గెలిచిందని విమర్శించారు.

టీఆర్ఎస్‌కు ఓటు వేయకపోతే పెన్షన్లు  ఆపేస్తామని మంత్రులు బెదిరించారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి సోమ్ముకు కమ్యూనిస్టు నాయకులు అమ్ముడుపోయారని ఆరోపించారు. పోలింగ్ ఏజెంట్లుగా కూర్చొన్న బీజేపీ కార్యకర్తలను కూడా భయపెట్టారని ఆరోపించారు. ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని ఓడించేందుకు మునుగోడులో కౌరవ సైన్యంలా వంద మంది మంత్రులు, ఎమ్మెల్యేలను మునుగోడులో దింపారని విమర్శించారు. ఒక్కడినే కౌరవ సైన్యాన్ని తట్టుకుని గట్టిగా పోరాడానని చెప్పారు. తాను నామినేషన్ వేయకముందే.. వాళ్లకు అనుకూలంగా ఉండే పోలీసులు, అధికారులు మునుగోడులో పోస్టింగ్స్ ఇచ్చారని ఆరోపించారు. మునుగోడులో 10 వేల ఓట్లు ఉన్న బీజేపీ ఇప్పుడు 80 వేల వరకు వచ్చిందన్నారు. ప్రలోభాలు, బెదిరింపులతోనే టీఆర్ఎస్ అధర్మంగా గెలిచిందని అన్నారు.  

మునుగోడులో నైతిక విజయం తనదేనని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే తెలంగాణ  కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. మునుగోడులో తనకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టుగా చెప్పారు. 

ఇక, మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. 13వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 9 వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరో రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తి కావాల్సి ఉంది. అయితే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఓటమిని అంగీకరించి.. కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios