నల్గొండ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను మంచి మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మి. తన భర్త ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తోడుగా ప్రజా సేవ చెయ్యాలనేది తన కోరిక అని ఆమె స్పష్టం చేశారు. 

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేసన్ దాఖలు చేసిన ఆమె మహిళలకు సేవ చేసేందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. మంచి మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని తాను నమ్ముతున్నట్లు స్పష్టం చేశారు. 

కోమటిరెడ్డి బ్రదర్స్ ఎన్నోసార్లు తామేంటో నిరూపించుకున్నారని తెలిపారు. తమ కుటుంబానికి ప్రజల అభిమానం ఉందని వారికి సేవ చేసుకునేందుకే తాము రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. 

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇకపై ప్రజల సమస్యల కోసం పోరాడుతూనే ఉంటానని ప్రజల మధ్యనే ఉంటూ ఎలాంటి పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొంటానని ఎమ్మెల్సీ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మీ ధీమా  వ్యక్తం చేశారు.