కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక పదవి.. ?
Komati reddy raj gopal reddy : మునుగోడు ఉప ఎన్నికలతో రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిన పేరు కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. ఆయన ఈ సారి కూడా మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున ఘన విజయం సాధించారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన ఆయనకు రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో కీలక పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Komati reddy raj gopal reddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఆ పార్టీ 64 స్థానాలను కైవసం చేసుకుంది. అధికార బీఆర్ఎస్ 39 స్థానాలకే పరిమితమయ్యింది. దీంతో ఆ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించనుంది. బీజేపీ 8 సీట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఐఎంఐ తన గత 7 స్థానాలను పదిలపర్చుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.
తెలంగాణ సీఎంగా అనుముల రేవంత్ రెడ్డి పేరు ఇప్పటికే ఖరారైంది. ఇక ఆయన ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలింది. అయితే ఇప్పుడు ఆయన మంత్రివర్గంలో ఎవరు ఉండబోతున్నారనే తెలంగాణ వ్యాప్తంగా మొదలైంది. ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరిని నియమిస్తారని టాక్ మొదలైంది. అయితే మంత్రులుగా ఆ పార్టీ సీనియర్ లీడర్లలో ఒకరైన కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి చోటు కల్పిస్తారని చర్చ జరుగుతోంది. ఆయనకు కీలక మంత్రిత్వ శాఖను కేటాయించే సూచనలు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ లో మంచి గుర్తింపు ఉన్న లీడర్ గా ఆయనకు పేరుంది. 2009 లో ఆయన భువనగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత వచ్చిన 2014 లోక్ సభ ఎన్నికల్లో ఆదే స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2016లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తరువాత 2018లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆయన గతేడాది ఆగస్టులో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరి వార్తల్లో నిలిచారు. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు వచ్చారు. ఈ ఉప ఎన్నికలు రాష్ట్రం మొత్తం దృష్టిని ఆకర్షించాయి. హోరా హోరీగా సాగిన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
అయితే బీజేపీలో ఆయన ఎక్కువ కాలం ఇముడలేకపోయారు. దీంతో ఆయన తిరిగి తన సొంత గూటికి చేరారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరుఫున మునుగోడులో ఘన విజయం సాధించారు. ఆయన కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీ భువనగిరి పార్లమెంట్ పరిధిలో బలపడింది. ఆ నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడంలో ఇది ఎంతో దోహదపడింది. తనతో పాటు పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను గెలిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
రాజ్ గోపాల్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తెలంగాణలో బీజీపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే నినాదం ప్రజల్లోకి చాలా బలంగా వెళ్లింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు లాభం చేకూర్చింది. అందుకే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తోందని తెలుస్తోంది. దీంతో పాటు బీజేపీలో ఎగ్జిక్యూటివ్ కమీటి మెంబెర్ గా, స్క్రీనింగ్ కమీటి చైర్మన్ ఉన్న ఆయనను పార్టీలోకి ఆహ్వానించిన సమయంలో మంత్రి పదవి హామీ ఇచ్చినట్టు సమాచారం. కాబట్టి రాజ్ గోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని తెలంగాణ రాష్ఠ్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.