కొల్లాపూర్ నియోజకవర్గం నుండి ఈసారి బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం దక్కుతుందని ఆశించి భంగపడ్డారు విష్ణువర్ధన్ రెడ్డి.. దీంతో ఆయనకే టికెట్ కేటాయించాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.
నాగర్ కర్నూల్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను కూడా ప్రకటించారు. కేవలం కొన్నిచోట్ల మార్పులు మినహా అందరు సిట్టింగ్ లకే కేసీఆర్ మరోసారి అవకాశం ఇచ్చారు. దీంతో ఈసారి తమకే బిఆర్ఎస్ అవకాశం ఇస్తుందని ఆశించిన కొందరు సీనియర్లకు భంగపాటు తప్పలేదు. ఇలాంటి నాయకుల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఒకరు.
గత ఎన్నికల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు బిఆర్ఎస్ పార్టీ నుండి కొల్లాపూర్ నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసారు. బిఆర్ఎస్ హవా కొనసాగిన ఈ ఎన్నికల్లో స్వయంగా మంత్రిగా వున్నా జూపల్లి ఓటమిపాలయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన బీరం హర్షవర్దన్ రెడ్డి అధికార పార్టీలో చేరారు. దీంతో బిఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత లభించకపోవడంతో జూపల్లి ఇటీవలే బిఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.
సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్దన్ పై ప్రజా వ్యతిరేకత వుంది... జూపల్లి పార్టీ మారారు కాబట్టి ఈసారి బిఆర్ఎస్ టికెట్ తనకే దక్కుతుందని విష్ణువర్దన్ ఆశించారు. కానీ సీఎం కేసీఆర్ సొంత పార్టీలో గెలిచిన వారితో పాటు కాంగ్రెస్ నుండి చేరిన సిట్టింగ్ లకే అవకాశం ఇచ్చారు. దీంతో విష్ణువర్దన్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Read More కాంగ్రెస్, బీజేపీ ప్రకటనలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు: మంత్రి హరీశ్ రావు
ఎప్పటినుండో బిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న విష్ణువర్దన్ కు సరైన అవకాశాలు దక్కడంలేదని ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న సీనియర్ నాయకుడి సేవలను బిఆర్ఎస్ పార్టీ వినియోగించుకోవాలని కోరుతున్నారు. పార్టీ కోసం నిబద్దతతో పనిచేస్తున్న మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే పోటీ చేయించడం లేదంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు.
గతంలోనూ నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీఇచ్చి ఇవ్వలేదని... ఈసారి కూడా అలా చేయవద్దని విష్ణువర్ధన్ అనుచరులు కోరుతున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆయనకు బలమైన క్యాడర్ వుందని... గెలుపోటములను శాసించే స్థాయి నాయకునికి సముచిత స్థానం కల్పించాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ల నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై బిఆర్ఎస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుటుందో చూడాలి.
