హైదరాబాద్: ప్రముఖ వ్యాపార వేత్త రాంప్రసాద్‌ను హత్య చేసేందుకు కోగంటి సత్యం, ఆయన అనుచరుడు శ్యామ్‌లు  సుఫారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకొన్నట్టుగా హైద్రాబాద్ పోలీసులు గుర్తించారు. తన బాస్ కళ్లలో ఆనందం చూసేందుకు శ్యామ్ ఈ కేసులో పాలుపంచుకొన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ గ్యాంగ్‌ కోసం  పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ కోగంటి సత్యంతో పాటు  ఆయన బృందాన్ని పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఈ నెల 6వ తేదీ రాత్రి పంజగుట్ట సమీపంలో  రాంప్రసాద్‌ను  ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు.

ఈ ఘటన వెనుక కోగంటి సత్యం హస్తం ఉందని రాంప్రసాద్ భార్య వైదేహీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 8వ తేదీ రాత్రి సత్యంను పోలీసులు అరెస్ట్ చేశారు.  అయితే  అంతకుముందే శ్యామ్‌తో పాటు మరో ఇద్దరు రాంప్రసాద్‌ను హత్య చేసినట్టుగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.

కామాక్షి స్టీల్ వ్యవహారంలో చోటు చేసుకొన్న ఆర్థిక విభేదాల కారణంగానే రాంప్రసాద్‌ను అడ్డు తొలగించుకోవాలని  కోగంటి సత్యం స్కెచ్ వేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  

రాంప్రసాద్‌ను హత్య చేసేందుకు శ్యామ్, కోగంటి సత్యం సుఫారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకొన్నట్టుగా  పోలీసులు గుర్తించారు.ఈ గ్యాంగ్ కోసం  పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని  ప్రశ్నిస్తున్నారు.