హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తామని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ప్రకటించారు. మేధావులు మౌనం వహించడం సరైందికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆదివారంనాడు హైద్రాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా సంఘాలు బాగా పనిచేశాయని ఆయన అభినందించారు.

పదవీకాంక్షతో తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. కొందరు ఇండిపెండెంట్ అభ్యర్ధులను టీఆర్ఎస్ బరిలోకి దింపిందని ఆయన ఆరోపించారు. గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కిందన్నారు. డబ్బులను, అధికార బలాన్ని ఉపయోగించుకొందని ఆయన ఆరోపించారు.

పోలింగ్ కేంద్రాల వద్దే బహిరంగంగా డబ్బులు పంచారని ఆయన విమర్శలు గుప్పించారు.ఇంత చేసినా కూడ టీఆర్ఎస్ కు అరకొర మెజారిటీ మాత్రమే వచ్చిందని ఆయన చెప్పారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతికంగా తాను విజయం సాధించినట్టుగా ఆయన తెలిపారు. రాజకీయంగా ప్రభుత్వం బలహీనమైందని ఆయన అభిప్రాయపడ్డారు. 

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని ఆయన తేల్చి చెప్పారు.ఓట్లను చీల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను సమర్ధవంతంగా తిప్పికొట్టామన్నారు. నల్గొండ ఎమ్మెల్సీ స్థానం నుండి పోటీ చేసిన కోదండరామ్ ఓటమి పాలైన విషయం తెలిసిందే.