Asianet News TeluguAsianet News Telugu

మహా కూటమికి షాక్: బిజెపి వైపు కోదండరామ్

కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జన సమితి (టీజెఎస్) 25 సీట్లు అడుగుతోంది. కాంగ్రెసు మాత్రం 3 సీట్లకు మించి ఇచ్చేది లేదని తెగేసి చెబుతోంది. కనీసం 15 సీట్లు ఇస్తేనే మహా కూటమిలో కొనసాగాలనే ఉద్దేశంతో కోదండరామ్ ఉన్నట్లు తెలుస్తోంది. 

Kodandaram may switch over to BJP
Author
Hyderabad, First Published Sep 29, 2018, 11:14 AM IST

హైదరాబాద్: కాంగ్రెసు నేతృత్వంలోని మహా కూటమిలో సీట్ల పంపకంపై సయోధ్య కుదరడం లేదు. తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జన సమితి అడుగుతున్న సీట్లను ఇవ్వడానికి కాంగ్రెసు ముందుకు రావడం లేదు. తాము కచ్చితంగా 90 సీట్లకు పోటీ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెసు ఉంది. మిగతా సీట్లను భాగస్వామ్య పార్టీలకు పంచాలనేది ఆ పార్టీ నాయకత్వం ఆలోచన.

అయితే, కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జన సమితి (టీజెఎస్) 25 సీట్లు అడుగుతోంది. కాంగ్రెసు మాత్రం 3 సీట్లకు మించి ఇచ్చేది లేదని తెగేసి చెబుతోంది. కనీసం 15 సీట్లు ఇస్తేనే మహా కూటమిలో కొనసాగాలనే ఉద్దేశంతో కోదండరామ్ ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం జరిగే మహా కూటమి సమావేశంలో సీట్ల పంపకంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఏదో ఒకటి తేలిపోతుందని అంటున్నారు. 

ఈ నేపథ్యంలోనే ఆయన మహా కూటమితో తెగదెంపులు చేసుకునే విషయంపై కూడా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన ఇప్పటికే బిజెపి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ విషయాన్ని బిజెపి నేత కిషన్ రెడ్డి ధృవీకరించారు కూడా. కోదండరామ్ నిర్ణయం కోసం బిజెపి నేతలు ఎదురు చూస్తున్నారు. 

కోదండరామ్ బిజెపితో వెళ్లాలనే ఆలోచన తనదైన వ్యూహం ఉందని చెబుతున్నారు. కాంగ్రెసుతో వెళ్లి రెండు, మూడు సీట్లను తీసుకుని పోటీ చేసి గెలిచినా పెద్దగా ఫలితం ఉండదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. బిజెపితో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ సీట్లకు పోటీ చేసే అవకాశం వస్తుందని, తద్వారా బలమైన శక్తిగా ఎదగడానికి అది పనికి వస్తుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. సీట్లను గెలుచుకోవడం కన్నా రాజకీయంగా బలాన్ని సంతరించుకోవడం ముఖ్యమని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలావుంటే, కోదండరామ్ వచ్చే నెల 3వ తేదీ నుంచి ఎన్నికల యాత్రను చేపట్టాలని అనుకుంటున్నారు. అక్టోబర్ 3వ తేదీన మెదక్ నుంచి తన యాత్రను ప్రారంభించి, రాష్ట్రాన్ని చుట్టి రావాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios