హైదరాబాద్: తెలంగాణ జన సమితి (టీజెఎస్) అధ్యక్షుడు కోదండరామ్ గురువారం సాయంత్రం హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. జనగామ పంచాయతీ తేల్చడానికి ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. జనగామ సీటును కోదండరామ్ కు ఇవ్వాలనే ప్రతిపాదనను కాంగ్రెసు సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

తొలి జాబితాలో తన పేరు లేకపోవడం, జనగామ సీటును కోదండరామ్ కు కేటాయిస్తున్నట్లు వార్తలు రావడం జరిగిన వెంటనే పొన్నాల ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అప్పటి నుంచి ఆయన అక్కడే మకాం వేశారు. ఈలోగా సీట్ల పంచాయతీ తేలకపోవడంతో టిజెఎస్ తాను పోటీ చేసే స్థానాలను ప్రకటించింది. అందులో జనగామ సీటు కూడా ఉంది. ఈ స్థితిలో కోదండరామ్ ను రాహుల్ గాంధీ ఢిల్లీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, కాంగ్రెస్ నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలకు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.  రాహుల్ గాంధీ అపాయింట్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఆయనతో మాట్లాడే అవకాశం చిక్కింది. 35 ఏళ్లుగా జనగామకు  తను ప్రాతినిధ్యం వహిస్తున్నానని, ఇప్పుడు ఆ సీటును మరొకరికి కేటాయించడం సరి కాదని పొన్నాల రాహుల్ గాంధీతో చెప్పారు. 

జనగామకు సంబంధించిన అన్ని అంశాలను కుంతియాకు వివరించాలని, టీజేఎస్ అధినేత కోదండరామ్‌తో మాట్లాడాలని రాహుల్ గాంధీ పొంగులేటితో చెప్పినట్లు సమాచారం. జనగామ సమస్యను పరిష్కరిస్తామని పొన్నాలకు రాహుల్‌ భరోసా ఇచ్చారు.
 
రెండు జాబితాల్లో తన పేరు లేనంత మాత్రాన టికెట్‌ రాదనుకోవడం సరికాదని పొన్నాల అన్నారు. పొత్తుల వల్ల కొన్ని సీట్లకు టికెట్ల ప్రకటన ఆలస్యమవుతోందని అన్నారు. టీజేఎస్‌ గెలిచే స్థానాలు ఉన్నా జనగామ సీటునే ఎందుకు కోరుతోందని ప్రశ్నించారు.