హైదరాబాద్‌: తెలంగాణ జనసమితి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని వస్తున్న వార్తలను ఆ పార్టీ అధినేత కోదండరామ్ ఖండించారు. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఓటమితో తాము నిరాశ చెందలేదన్నారు. 

రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకంటూ అంతర్గతంగా ఓ ఆలోచన ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికలకు తమ పార్టీ సిద్దంగా ఉందవని ప్రకటించారు. పార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే ఎన్నికలు రావడంతో ఓటమి చెందినట్లు భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.

మరోవైపు ప్రస్తుత రాజకీయాలపై కోదండరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు బట్టలు మార్చినంత సులువుగా పార్టీలు మారస్తున్నారని మండిపడ్డారు. గతంలో నమ్మిన సిద్దాంత కోసం పార్టీలలో ఉండే వారని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల లేవన్నారు. 

లోక్‌సభ ఎన్నికలు, పొత్తులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూటమి ఓటమిపై చర్చజరగలేదని తెలిపారు. కూటమిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంపై కూడా చర్చ జరగలేదన్నారు. 

అటు రాష్ట్రఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ పై కోదండరామ్ అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌ నిస్వార్థంగా విధులు నిర్వహించడంలో విఫలమైందని ఆరోపించారు. శాసనసభ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయన్నారు. 

కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. రజత్‌కుమార్‌ని పార్లమెంట్‌ ఎన్నికల వరకు కొనసాగించవద్దంటూ  రాష్ట్రపతికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని కోదండరామ్ హెచ్చరించారు.