హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల సర్ధుబాటుపై నాన్చకుండా త్వరగా తేల్చాలని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ సూచించారు. మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన పాత్ర అన్న కోదండరామ్ సీట్ల సర్దుబాటుపై నాన్చివేత ధోరణి మంచిది కాదని హితవు పలికారు. 

సీట్ల సర్ధుబాటు అంశం ఓ కొలిక్కి రాకపోతే రెండు రోజుల్లో తన నిర్ణయం ప్రకటిస్తానని కాంగ్రెస్ పార్టీకి మరోసారి కోదండరామ్ అల్టిమేటం జారీ చేశారు. సీట్ల సర్ధుబాటు అంశం తేలకపోవడం వల్ల గందరగోళం నెలకొనే అవకాశం ఉందన్నారు. పార్టీ అస్థిత్వానికి లోబడే సీట్ల సర్ధుబాటు ఉంటుందని కోదండ రామ్ తెలిపారు. 

మరోవైపు సీట్ల సర్ధుబాటుపై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న విషయం తనకు తెలియదని కోదండరామ్ తేల్చిచెప్పారు. అలాగే జనసమితితో పొత్తు వద్దంటున్న కాంగ్రెస్ పార్టీ నేతల వ్యాఖ్యలపై తాను ఎలాంటి కామెంట్స్ చేయదలుచుకోలేదని తెలిపారు. ఎవరి బలం వారికి ఉందని తెలిపారు. అభ్యర్థుల జాబితా ఖరారు కావాల్సి ఉందన్నారు.