రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో తెలంగాణలో యూరియా కొరత తీరుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం ప్రతి యూరియా బస్తాపై భారీగా రాయితీ ఇస్తుందని చెప్పారు.

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో తెలంగాణలో యూరియా కొరత తీరుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం ప్రతి యూరియా బస్తాపై భారీగా రాయితీ ఇస్తుందని చెప్పారు. రూ. 6,338 కోట్లతో ఆర్ఎఫ్‌సీఎల్‌ను పునరుద్దరించడం జరిగిందని తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పర్యటించిన ప్రధాని మోదీ.. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌ను(ఆర్ఎఫ్‌సీఎల్) జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీతో పాటు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, భగవంత్ ఖుబా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ధాన్యం కొనుగోలు కోసం కేంద్రం ఏటా రూ. 26 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. 2014లో తెలంగాణలో 24 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనేవాళ్లని చెప్పారు. ఇప్పుడు 142 లక్షల టన్నుల ధాన్యం కొంటున్నామని తెలిపారు. కానీ కొందరు కేంద్రం ధాన్యం కొనడం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2014కు ముందు ధాన్యం క్వింటాల్‌కు ఎంఎస్‌పీ 1,360 ఉంటే.. మోదీ ప్రభుత్వం వచ్చాక అది 2,040కి చేరిందని అన్నారు. 

2014 నాటికి తెలంగాణలో 2,511 కి.మీ మేర ఉన్న జాతీయ రహదారులు ఉండేవనీ.. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 5 వేల కి.మీకు చేరాయని చెప్పారు. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తారని ఎవరూ చెప్పారని ప్రశ్నించారు. సింగరేణి మెజారిటీ షేర్‌లు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉన్నాయని చెప్పారు. కానీ కేంద్రం సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కోల్ ఇండియాకు సంబంధించిన ఏ పరిశ్రమను ప్రైవేటుపరం చేయలేదని తెలిపారు. సింగరేణి పరిధిలోని ఇతర రాష్ట్రాల్లోని బొగ్గు గనులను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారని అన్నారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఆలోచన కేంద్రానికి లేదని అన్నారు. రామగుండంలో 1600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్క తెలంగాణలోనే కేంద్రం 4 వేల కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. రామగుండంలో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారని చెప్పారు. రామగుండంలో ఈఎస్‌ఐ ఆస్పత్రిని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని.. ఇక్కడున్న ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదన్నారు. 

ప్రధాని మోదీ నాయకత్వంలో కచ్చితంగా తెలంగాణలోని ప్రతి పట్టణాన్ని, ప్రతి జిల్లాను, ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేస్తామని చెప్పారు. గ్రామాల్లో రోడ్లు, పారిశుద్ద్యానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని చెప్పారు. కరోనా వచ్చిన సమయంలో ప్రధాని మోదీ ఏరకంగా ప్రజల ప్రాణాలు కాపాడారో అందరికి తెలుసని అన్నారు. ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసి ప్రజల ప్రాణాలు కాపాడటంతో మోదీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని చెప్పారు.. ఎవరూ సహకరించినా? సహకరించకపోయినా?.. తెలంగాణ అభివృద్ది కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గత 8 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్దిని ఇంటింటికి వెళ్లి వివరిస్తామని చెప్పారు.