పంచెకట్టులో ఒకరు... అచ్చతెలుగులో మరొకరు... లొక్‌సభలో వెల్లివిరిసిన తెలుగుతనం

ఇవాళ లోక్ సభలో తెలుగుదనం ఉట్టిపడింది. ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు తెెలుగులోనే ప్రమాణస్వీకారం చేసారు. వీరిలో కిషన్ రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్ మరింత ప్రత్యేకంగా తెెలుగు వైభవాన్ని లోక్ సభలో ప్రదర్శించారు.

Kishan Reddy and Pemmasani Chandrashekar taking oath in Lok Sabha AKP

Parliament Session 2024 : లోక్ సభ ఎన్నికలు ముగిసాయి... బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యారు... ఆయనతో పాటు కేంద్ర మంత్రులు ఇప్పటికే ప్రమాణస్వీకారం చేసారు. ఈ మోదీ 3.O సర్కార్ లో తెలుగు ఎంపీలకు కీలక బాధ్యతలు దక్కాయి. గత మోదీ కేబినెట్ లో కేవలం ఒక్కరంటే ఒక్కరే తెలుగోడు కేంద్ర మంత్రివర్గంలో వుండగా ఈసారిమాత్రం ఏకంగా ఐదుగురికి ఆ అవకాశం దక్కింది. ఇది చాలు కేంద్రంలో తెలుగు రాష్ట్రాల పలుకుబడి ఏస్థాయిలో పెరిగిందో  చెప్పడానికి. మరీముఖ్యంగా గతంలో ఆంధ్ర ప్రదేశ్ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు...  కానీ ఇప్పుడు టిడిపి ఎంపీలు లేకుంటే మోదీ ప్రభుత్వమే లేదనే పరిస్థితి వుంది. అలాగే ఉత్తరాదిన బిజెపి దెబ్బతిన్నా దక్షిణాదిన తెలంగాణలొ ఆ పార్టీ ఎప్పుడూ సాధించనన్ని ఎంపీ సీట్లతో సత్తాచాటింది... దీంతో ఈ రాష్ట్రానికి కూడా ఈసారి మరింత ప్రాధాన్యత దక్కింది. 
 
తాజా సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఆంధ్ర ప్రదేశ్ లో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ కూటమి ఏకంగా 21 సీట్లు (టిడిపి 16, జనసేన 2, బిజెపి 3) సాధించింది. మరో తెలుగు రాష్ట్ర తెలంగాణలో కూడా బిజెపి సత్తా చాటింది. మొత్తం 17 సీట్లలో బిజెపి ఏకంగా 8 సీట్లు సాధించింది... కాంగ్రెస్ అధికారంలో వున్న రాష్ట్రంలో బిజెపి ఈస్థాయి ప్రదర్శన కనబర్చింది.  ఇలా ఎన్డిఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తున్న తెలుగు రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యత లభించింది.  

అయితే ఇప్పటికే ప్రధానిగా మోదీ, కేబినెట్ మంత్రులుగా మరికొందరు ఎంపీలు ప్రమాణస్వీకారం చేసారు. వాళ్లంతా ఇవాళ మరోసారి లోక్ సభలో ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేసారు. లోక్ సభలో ప్రోటెం స్పీకర్ ఎదుట ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ఎంపీలు ప్రమాణస్వీకారం చేసారు.ఈ క్రమంలో ఇద్దరు తెలుగు  రాష్ట్రాలకు చెందిన మంత్రులు లోక్ సభ సభ్యులందరిలో ప్రత్యేకంగా నిలిచారు. ఒకరు తెలుగుదనానికి వన్నెతెచ్చెలా వ్యవహరిస్తే... మరొకరు అచ్చ తెలుగు బాషను యావత్ దేశానికి వినిపించారు. 

ఇలా ఎంపీల ప్రమాణస్వీకారం వేళ లోక్ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్. ఇప్పటికే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి ఇవాళ లోక్ సభలో ప్రమాణస్వీకారం చేసారు. అయితే ఆయన అచ్చతెలుగు పంచెకట్టులో ప్రమాణస్వీకారానికి విచ్చేసారు...అతడి వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. కేవలం వేషధారణే కాదు ప్రమాణస్వీకారం కూడా అచ్చతెలుగులో చేసారు కిషన్ రెడ్డి. ఇలా పార్లమెంట్ కు పంచెకట్టులో వెళ్ళి తెలుగు పదాలను వళ్ళెవేస్తూ మన తెలుగోళ్లను ఉప్పొంగిపోయేలా చేసారు సికింద్రబాద్ ఎంపీ.  

ఇక మరో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే మరో అడుగు ముందుకేసారు...  సూటు బూటు వేసుకుని వచ్చిన అతడు ఇంగ్లీష్ లో ప్రమాణ స్వీకారం చేస్తాడని అందరూ భావించారు. కానీ ఆయన తెలుగులోనే ప్రమాణస్వీకారం చేసారు... అదీ మామూలు తెలుగు కాదు గ్రాంధీక తెలుగులో చేసి అందరినీ ఆశ్చర్యపర్చారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు కూడా తెలుగులోనే ప్రమాణస్వీకారం చేసినా పెమ్మసాని అచ్చ తెలుగులో ప్రమాణస్వీకారం చేసారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios