హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీఫామ్ విద్యార్థిని కిడ్నాప్ కేసును రాచకొండ పోలీసులు చేధించారు. బీఫామ్ విద్యార్థిని కిడ్నాప్ చేసి తప్పించుకు తిరుగుతున్న కిడ్నాపర్ రవిశేఖర్ ను మీడియా ముందు ప్రవేశపెట్టారు రాచకొండ పోలీసులు. 

కిడ్నాపర్ రవిశేఖర్ కు చాలా నేరచరిత్ర ఉందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. కిడ్నాపర్ రవిశేఖర్ నేరాలు చేయడంలోనే కాదు, తప్పించుకోవడంలోనూ దిట్ట అని స్పష్టం చేశారు. 

రవిశేఖర్ చేసిన ప్రతీ నేరం ఒక స్టోరీని తలపిస్తోందని చెప్పుకొచ్చారు. విచారణలో తన నేరాల చిట్టా చెప్తూ చాలా హుషారుగా కనిపించారని స్పష్టం చేశారు సీపీ మహేశ్ భగవత్. టెక్నికల్ గా చాలా జాగ్రత్త పడుతుండేవాడని చెప్పుకొచ్చారు. 

బీఫామ్ విద్యార్థిని కిడ్నాప్ కేసులో చాలా వ్యూహాత్మకంగా నిందితుడు ప్రవర్తించాడని సీపీ స్పష్టం చేశారు. బాధితురాలని భయపెట్టి వారం రోజుల పాటు తప్పించుకు తిరిగాడని చెప్పుకొచ్చారు. విద్యార్థి కిడ్నాప్ కేసులో కార్ నే ప్రధాన ఆయుధంగా రవిశేఖర్ వాడుకున్నారని తెలిపారు. 

తొలుత యువతి రవిశేఖర్ ను నమ్మిందని అయితే ఆ తర్వాత తిరుపతి, కడప, ఒంగోలు అంటూ వివిధ ప్రాంతాలు, అధికారుల పేర్లు చెప్పడంతో తాను కిడ్నాప్ కు గురయ్యానని బాధితురాలికి తెలిసిందన్నారు. తప్పించుకుందామని ఎంత ప్రయత్నించినా కిడ్నాపర్ శేఖర్ కార్ లోనే యువతిని పెట్టి లాక్ చేసేవాడని చెప్పుకొచ్చారు. 

బాధితురాలిని ఆసరాగా చేసుకుని మరికొందరిని మోసం చేయాలని కిడ్నాపర్ రవిశేఖర్ ప్రయత్నించాడని సీపీ తెలిపారు. అయితే బాధితురాలు ఆందోళనగా ఉండటంతో చివరికి ఆమెను ప్రకాశం జిల్లా అద్దంకిలో బస్సు ఎక్కించాడని తెలిపారు. అక్కడ నుంచి ఆమె హైదరాబాద్ వచ్చిందని తాము ఆమెను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఆమె నుంచి మరింత సమాచారం రావాల్సి ఉందన్నారు. 

రవిశేఖర్ రోజురోజుకు కొత్త కొత్త నేరాలకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏడు కేసులలో ముద్దాయిగా రవిశేఖర్ ఉన్నారని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. నిందితుడు రవిశేఖర్ కు మంచి టాకింగ్ పవర్ ఉందని ఇతను ఎవరితో మాట్లాడినా వెంటనే ఆకర్షితులు అవుతారని చెప్పుకొచ్చారు. ఏపీలో రవిశేఖర్ పై 50 కేసులు ఉన్నాయని చెప్పుకొచ్చారు.  

ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని వస్తే వారి మాటలు నమ్మ వద్దని సీపీ సూచించారు. సర్వీస్ కమిషన్ల ద్వారానే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తారని దానికి బేక్ డోర్స్ ఏమీ ఉండవన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా వస్తే తమను సంప్రదించాలని సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు.