కోకాపేట భూముల వేలంలో ట్విస్ట్... దేవుడి భూములు అమ్మారంటూ స్థానికుల ఆందోళన
ఇటీవల కేసీఆర్ సర్కార్ వేలంవేసిన కోకపేట నియోపోలీస్ భూముల్లో దేవుడి మాన్యం వుందంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఇటీవల శివారులోని భూములకు మంచి గిరాకీ వుంది. దీంతో ప్రభుత్వం నగరం చుట్టుపక్కల భూములను అమ్ముకుంటూ భారీగా నిధులను సేకరించుకుంటోంది. ఇలా ఇటీవల కోకాపేటలో భూములను వేలంవేయగా ఎకరం వందకోట్లకు అమ్ముడుపోవడం సంచలనంగా మారింది. అయితే ఇలా వేలంవేసిన భూముల్లో దేవుడి మాన్యాలు వున్నాయంటూ తాజాగా గండిపేట మండలం ఖానాపూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
ఖానాపూర్ గ్రామానికి చెందిన పురాతన శివాలయానికి చెందిన భూమి నియోపోలీస్ భూముల దగ్గర వుంది. అయితే ఇటీవల నియోపోలీస్ భూముల వేలంలో దేవాలయ భూమిని కూడా వేలం వేసారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆన్ లైన్ వేలంపాటలో తమ గ్రామానికి చెందిన భూమి వున్నట్లు తెలియలేదన్నారు. తాజాగా దేవాలయ భూమిని వేలంపాటలో దక్కించుకున్న సంస్థ చదును చేస్తుండటంతో తమకు తెలిసిందని ఖానాపూర్ గ్రామస్తులు తెలిపారు.
తమ గ్రామానికి చెందిన శివాలయం భూమిని ప్రభుత్వం అక్రమంగా అమ్ముకుందని ఖానాపూర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ భూమిని పరిరక్షించుకునేందుకు పోరాటం కొనసాగిస్తామని ఖానాపూర్ గ్రామస్తులు తెలిపారు.
Read More Congress: తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. పలు ప్యానెల్లను ఏర్పాటు చేసిన కాంగ్రెస్..
ఇటీవల నియోపొలిస్ లే అవుట్ లోని 45.33 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఏడు ప్లాట్లను ప్రభుత్వం వేలం వేసింది. ఈ క్రమంలో కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధర పలికాయి. అత్యధికంగా ఎకరం భూమి ధర రూ. 100.75 కోట్లు పలికింది. కోకాపేట భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి రూ. 3,319.60 కోట్ల ఆదాయం సమకూరింది. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి రూ. 100.75 కోట్లు పలకగా, అత్యల్పంగా రూ. 67.25 కోట్లు పలికింది. ఎకరం భూమి సగటున రూ. 73.23 కోట్లు పలికింది.