Congress: తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. పలు ప్యానెల్లను ఏర్పాటు చేసిన కాంగ్రెస్..
Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ పలు కమిటీలను ఏర్పాటు చేసింది. తక్షణమే ఈ కమిటీల ఏర్పాటు ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదం తెలిపినట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటికే ఆ పార్టీ దూకుడుగా ముందుకు సాగుతోంది.
Telangana Assembly Elections 2023: ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఎలాగైన ఈ ఎన్నికల్లో విజయం సాధించి అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తోంది. కర్నాటక తరహాలో రాష్ట్రంలో ఎన్నికల వ్యూహాలు అమలుచేస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలు హామీలను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పలు ప్యానెల్లను ఏర్పాటు చేసింది. ఈ వారంలో రాష్ట్రంలో భారీ బహిరంగ సభను సైతం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల నిర్వహణ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, స్ట్రాటజీ కమిటీ సహా వివిధ కమిటీలను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఎన్నికల నిర్వహణ కమిటీకి దామోదర రాజనర్సింహ నేతృత్వం వహిస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. కమిటీలో సభ్యులుగా వంశీచంద్ రెడ్డి, ఇ.కొమురయ్య, జగన్ లాల్ నాయక్, ఫకృద్దీన్ ఉన్నారు.
మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వైస్ చైర్మన్ గా గడ్డం ప్రసాద్ నియమితులయ్యారు. స్ట్రాటజీ కమిటీకి ప్రేమ్ సాగర్ రావు నేతృత్వం వహిస్తారు. వీటితో పాటు ఏఐసీసీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ, పబ్లిసిటీ కమిటీ, ఛార్జ్ షీట్ కమిటీ, కమ్యూనికేషన్స్ కమిటీ, ట్రైనింగ్ కమిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. తక్షణమే ఈ కమిటీల ఏర్పాటు ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదం తెలిపినట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని గద్దె దింపుతామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది. బీజేపీ, బీఆర్ఎస్ లకు చెక్ పెట్టేందుకు తమ ముందున్న అన్ని వనరులను ఉపయోగించుకుంటోంది. ఇప్పటికే పలు హామీలు ప్రకటించింది. ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల జాబితాను త్వరలోనే ప్రకటిస్తామని ఆ పార్టీ వర్గలు చెబుతున్నాయి. ఇటీవలే అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవడానికి దరఖాస్తు చేసుకున్నారనీ, ఎంపికపై కసరత్తు జరుగుతున్నదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.