ప్రెస్‌మీట్‌లో కంటతడి.. ముందు ముందు మిమ్మల్ని ఏడిపిస్తా, జాన్సన్ ఎలా గెలుస్తాడా చూస్తా : రేఖా నాయక్ సవాల్
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాన్సన్ నాయక్ .. ఎలా గెలుస్తావో చూస్తా బిడ్డా అంటూ రేఖా నాయక్ సవాల్ విసిరారు. తాను ఇప్పుడు ఏడుస్తున్నానని.. ముందు ముందు మిమ్మల్ని ఏడిపిస్తానని ఆమె వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కాదని.. కేటీఆర్ ఫ్రెండ్‌ను తీసుకొచ్చి టిక్కెట్ ఇచ్చారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రేఖా నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్ధి ఎలా గెలుస్తారో చూస్తానంటూ ఆమె సవాల్ విసిరారు. తానేం స్కాంలు చేయలేదని.. తను షుగర్ పేషెంట్ అనడంతో పాటు తన కుటుంబంపై అసభ్యకరంగా మాట్లాడుతున్నారని రేఖా నాయక్ కన్నీటి పర్యంతమయ్యారు. తాను ఎమ్మెల్యేగా వుండగానే ఖానాపూర్‌కు నిధులు ఆపారని ఆమె ఆరోపించారు. కరోనా వచ్చి అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుని తిరిగి నాలుగు రోజుల్లోనే ప్రజలకు అందుబాటులో వున్నానని రేఖా నాయక్ చెప్పారు.
తాను ఇప్పుడు ఏడుస్తున్నానని.. ముందు ముందు మిమ్మల్ని ఏడిపిస్తానని ఆమె వ్యాఖ్యానించారు. రెవెన్యూ డివిజన్ గురించి స్వయంగా సీఎం కేసీఆర్ అడిగినా ఫలితం లేదన్నారు. మండలాలు, గ్రామ పంచాయతీలు, సబ్‌స్టేషన్ , రోడ్లు ఇలా ఏ ప్రతిపాదనను పట్టించుకోలేదని రేఖా నాయక్ దుయ్యబట్టారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని.. అది ఏ పార్టీ నుంచి అనేది త్వరలోనే చెబుతానని ఆమె స్పష్టం చేశారు. తన భర్త కాంగ్రెస్‌లో చేరగానే.. మా అల్లుడిని ట్రాన్స్‌ఫర్ చేశారని రేఖా నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌లో వుంటే ఒకలా, లేకుంటే మరోలా చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
Also Read: బిఆర్ఎస్ కు గుడ్ బై... కాంగ్రెస్ కు బైబై : పోటీకి మాత్రం సై అంటున్న రేఖా నాయక్
కేటీఆర్.. తన ఫ్రెండ్ కోసం ఇన్నాళ్లలో జరగని అభివృద్ధిని ఇప్పుడు ఆగమేఘాల మీద చేయిస్తున్నారని రేఖా నాయక్ ఆరోపించారు. అసలు ఈ జాన్సన్ నాయక్ ఎవరు.. ఉద్యమంలో ఎక్కడున్నారని ఆమె ప్రశ్నించారు. జాన్సన్ నాయక్ .. ఎలా గెలుస్తావో చూస్తా బిడ్డా అంటూ రేఖా నాయక్ సవాల్ విసిరారు.