తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఒకలా వుంటే ఖమ్మం జిల్లాలో మరోలా వున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీలోకి వలసలు కొససాగుతుంటే ఖమ్మంలో అందుకు  భిన్నమైన సంఘటన జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మండలాధ్యక్షుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీలో చేరి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ జంపింగ్ ద్వారా అతడు జడ్పిటీసి సీటును సొంతం  చేసుకున్నారు. 

ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని దమ్మపేట టీఆర్ఎస్ మండలాధ్యక్షుడిగా పానుగంటి సత్యం పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఆయన దమ్మపేట జడ్పిటిసి గా పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీలో ఆయనకు సీటు దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీ వీడడానికి సిద్దమయ్యారు. 

ఈ క్రమంలోనే స్థానికి టిడిపి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావుతో సత్యం చర్చించి జడ్పిటిసి సీటుపై హామీ పొందిన తర్వాత టిడిపిలో చేరారు. దమ్మపేటలో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో సత్యంకు ఎమ్మెల్యే టిడిపి కండువా కప్పి పార్టీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా దమ్మపేట జడ్పిటిసి స్థానాన్ని సత్యం కు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే మెచ్చా ప్రకటించారు. 

ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ...తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పార్టీలోకి తిరిగిరావడం చాలా సంతోషంగా వుందన్నారు. ఖమ్మం జిల్లా పరిధిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలు సత్తా చాటడం ఖాయమని సత్యం ధీమా వ్యక్తం చేశారు.