Asianet News TeluguAsianet News Telugu

సరిహద్దులు దాటి ఏపీలోకి తమ్మినేని కృష్ణయ్య హంతకులు... రంగంలోకి 4 ప్రత్యేక బృందాలు

టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్యను హత్య చేసిన నిందితులు సరిహద్దును దాటి ఆంధ్రప్రదేశ్‌లోకి పారిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో ఖమ్మం పోలీసులు నాలుగు బృందాలను రంగంలోకి దించారు. 

khammam police search operation in ap for accused of tammineni krishnaiah
Author
Khammam, First Published Aug 16, 2022, 9:36 PM IST

టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య ( tammineni krishnaiah ) నిందితులు ఏపీకి పరారయ్యారు. నిన్న ఆయనను హత్య చేసిన తర్వాత మహబూబాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఆశ్రయం కోసం ప్రయత్నించినట్లు సమాచారం. అయితే షెల్టర్ దొరక్కపోవడంతో ఏపీకి పారిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించడంతో పాటు నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను రంగంలోకి దించారు. 

ఇకపోతే.. తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో కృష్ణయ్య సోమవారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి పోలీసులు.. 8 మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ కేసులో.. ఏ-1 తమ్మినేని కోటేశ్వరరావు, ఏ-2 రంజాన్, ఏ-3 జక్కంపూడి కృష్ణ, ఏ-4 జి కృష్ణస్వామి, ఏ-5 నూకల లింగయ్య, ఏ-6 బండ నాగేశ్వరరావు, ఏ-7 బోడపట్ల శ్రీను, ఏ-8 ఎల్లంపల్లి నాగయ్య‌లను పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు. 

ALso REad:టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు.. 8 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు

తెల్దారుపల్లి గ్రామంలో సోమవారం ఉదయం బైక్​ మీద ఇంటికి వెళ్తున్న కృష్ణయ్యను దుండగులు ఆటోతో ఢీకొట్టారు. కృష్ణయ్య కిందపడిపోవడంతో దుండగులు వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సొంతూరు తెల్దారుపల్లి. తమ్మినేని వీరభద్రం బాబాయి కొడుకే కృష్ణయ్య. అయితే కృష్ణయ్య ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్నారు. మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుకు ఆయన ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. 

ఈ హత్య వెనుక గ్రామానికి చెందిన సీపీఎం సానుభూతిపరుల హస్తం ఉందని కృష్ణయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. టీఆర్‌ఎస్, సీపీఎం నాయకుల మధ్య రాజకీయ వైరం ఉందన్నారు. హత్యకు కారణమనే అనుమానంతో వీరభద్రం సొంత తమ్ముడు తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిపై కృష్ణయ్య అనుచరులు దాడి చేశారు. వాహనాలను, ఇంట్లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో తెల్దారుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు తెల్దారుపల్లిలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు. ఇక, తమ్మినేని కోటేశ్వరరావుతో పాటు మరో ఏడుగురు కుట్ర చేశారని కృష్ణయ్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ముగిసిన కృష్ణయ్య అంత్యక్రియలు.. 
మంగళవారం కృష్ణయ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలోనే  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. అంతిమ యాత్రకు వెళ్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతనే.. తెల్దారుపల్లిలోకి పంపించారు. కృష్ణయ్య అంతిమ యాత్రలో తుమ్మల నాగేశ్వరరావు, పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు, కృష్ణయ్య అనుచరులు పాల్గొన్నారు. ఖమ్మం సీపీ విష్ణు వారియర్‌ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios