గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణపతి... భారీగా తరలొచ్చిన భక్తులు
ఖైరతాబాద్ గణపతి గంగమ్మ ఒడికి చేరాడు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేశారు.
తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న ఖైరతాబాద్ గణపతి గంగమ్మ ఒడిలోకి చేరాడు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేశారు. గణేశుడికి వీడ్కోలు పలికేందుకు జంట నగరాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి.
గణేష్ ఉత్సవాలకు సంబంధించి హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ విగ్రహానికి ప్రతి యేటా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఖైరతాబాద్ విగ్రహాన్ని కచ్చితంగా నగరవాసులు దర్శించుకుని వస్తారు. భారీ విగ్రహంతో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. ఆకర్షించడంలో విఫలం అవ్వదు. ఈ ఏడాది ఖైరతాబాద్‌లో పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా ఆయన దర్శనం ఇచ్చారు. 50 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని తయారు చేశారు. ఈ గణపతికి ఎడమ వైపున త్రిశక్తి మహా గాయత్రి దేవి, కుడి వైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యం స్వామి కూడా దర్శనం ఇచ్చారు. 1954లో ఒక్క అడుగు ఎత్తుతో ఇక్కడ మొదలైన వినాయక చవితి ఉత్సవాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అయితే, ప్రతి ఏడాది ఈ ఎత్తును పెంచుతూ వచ్చారు. 60 ఏళ్ల వరకు ఈ పెరుగుదల కొనసాగింది. 2014 నుంచి ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు.