హైద్రాబాద్ ఖైరతాబాద్ శోభాయాత్ర ప్రారంభం: ట్యాంక్ బండ్ వైపు కదులుతున్న గణపయ్య
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ఇవాళ ఉదయమే ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు గణేష్ నిమజ్జన శోభాయాత్ర పూర్తి చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర గురువారంనాడు ప్రారంభమైంది. ఇవాళ ఉదయం ఆరు గంటల సమయంలోనే ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నానికి ఖైరతాబాద్ గణేష్ విగ్రహాం నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు ప్లాన్ చేశారు.
ఇందులో భాగంగానే ఖైరతాబాద్ గణేష్ విగ్రహా నిమజ్జన శోభాయాత్రకు ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల అనంతరం ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రను ప్రారంభించారు. ఖైరతాబాద్ , టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ట్యాంక్ బండ్ వరకు ఖైరతాబాద్ గణేష్ విగ్రహా శోభాయాత్ర సాగనుంది. ట్యాంక్ బండ్ వద్ద తుది పూజ నిర్వహించిన అనంతరం ట్యాంక్ బండ్ లో వినాయక విగ్రహా నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఖైరతాబాద్ వినాయక విగ్రహాం మధ్యాహ్నం 12 గంటల వరకు ట్యాంక్ బండ్ కు చేరుకొనేలా అధికారులు ప్లాన్ చేశారు.
ఈ ఏడాది ఖైరతాబాద్ లో శ్రీదశ మహా విద్యా గణపతిని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 63 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. దేశంలోనే ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి ఎంతో ప్రత్యేకతను సంతరించుకొంది. 1954 నుండి ఖైరతాబాద్ లో గణేష్ విగ్రహాల ఏర్పాటు ప్రారంభమైంది. ప్రతి ఏటా గణేష్ విగ్రహాల ఏర్పాటు ఎత్తును పెంచుకుంటూ పోయారు.బాలగంగాధర తిలక్ ఇచ్చిన పిలుపుతో మాజీ కార్పోరేటర్ సింగరి శంకరయ్య ఖైరతాబాద్ వద్ద గణేష్ విగ్రహాం ఏర్పాటును ప్రారంభించారు.
1954 నుండి 2014 వరకు గణేష్ విగ్రహాల ఎత్తును పెంచుకుంటూ పోయారు. అయితే 2014 నుండి ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఒక్కో అడుగును తగ్గిస్తూ వస్తున్నారు. 1960లో ఏనుగుపై ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఏనుగుపై ఊరేగించారు. 11 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సమయంలో పెద్ద ఎత్తున భక్తులు ఖైరతాబాద్ కు వచ్చి దర్శించుకున్నారు.2014 నుండి 2022 వరకు 60 నుండి 50 అడుగుల ఎత్తు వరకు గణేష్ విగ్రహాల ఎత్తు తగ్గించారు. అయితే ఈ ఏడాది మాత్రం 63 అడుగుల ఎత్తులో శ్రీదశ మహావిద్యాగణపతి విగ్రహాన్ని తయారు చేశారు.