Asianet News TeluguAsianet News Telugu

ఆత్మహత్యకు ముందు రాజు ఎక్కడెక్కడ తిరిగాడు..?

ఇందులో భాగంగానే ఉప్పల్ నుంచి స్టేషన్ ఘన్ పూర్ వరకూ ఉన్న 133 కిలోమీటర్ల మార్గంలో నిందితుడు ఎక్కడెక్కడ తిరిగాడు అనే విషయాలపై దృష్టి పెట్టారు.

Key Points Behind  Saidabad Accused Suicide case
Author
Hyderabad, First Published Sep 18, 2021, 8:07 AM IST

సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి.. అనంతరం అతి దారుణంగా హత్య చేసిన సంఘటన ఇంకా ఎవరూ మర్చిపోయి ఉండరు. కాగా.. ఈ ఘటనలో నిందితుడు రాజు చిన్నారిని చంపేసిన వారం రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.. ఈ ఘటనపై పోలీసుల పరిశోధన ఇంకా కొనసాగుతోంది. ఆత్మహత్యకు ముందు ఐదు రోజుల పాటు రాజు ఎక్కడెక్కడ తప్పించుకు తిరిగాడు..? ఏఏ ప్రాంతాల్లో ఉన్నాడనే విషయాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాచార  ఘటన దర్యాప్తు ప్రక్రియ సాంకేతికంగా ముగిసినా.. రాజు ఆత్మహత్యకు ముందు జరిగిన పరిణామాలను కోర్టు సమర్పించే అభియోగ పత్రాల్లో పేర్కొనేందుకు అవసరమైన సమాచారం సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉప్పల్ నుంచి స్టేషన్ ఘన్ పూర్ వరకూ ఉన్న 133 కిలోమీటర్ల మార్గంలో నిందితుడు ఎక్కడెక్కడ తిరిగాడు అనే విషయాలపై దృష్టి పెట్టారు.

హత్యాచార ఘటన అనంతరం ఈ నెల11 వరకూ నిందితుడు నగరంలో నే ఉన్నాడు. మలక్ పేట, సంతోష్ నగర్, చాంద్రాయణ గుట్ట, ఫలక్ నుమా, శాలిబండ, మొగల్ పురా, చార్మినార్ పరిసరాల్లో తిరిగాడు. పోలీసులకు దొరికిపోతాననే భయంతో 11న సాయంత్రం ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే బస్సు ఎక్కాడు. 

మధ్యలో దిగిన అతను ఎక్కడకు వెళ్లాడనది తెలియలేదు. ఆ రోజు రాత్రి నుంచి స్టేషన్ ఘన్ పూర్ చేరుకోవాలంటే నడిచి వెళ్తే రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున నాలుగు రోజుల్లో చేరుకోలేడని పోలీసులు అంచనా వేశారు.

నడిచి వెళ్లాలంటే ఇందుకు అసరమైన శక్తి కావాలి.. నీళ్లు, ఆహారం తప్పనిసరిగా ఉండాలి. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎవరైనా చూస్తే తెలిసిపోతుంది. దీంతో అతను కొన్ని కిలోమీటర్లు నడిచి ఉంటాడని అంచనా వేస్తున్నారు. బీబీ నగర్ నుంచి గూడూరు, పగిడిపల్లె, భువనగిరిల మధ్య గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆటోలుంటాయి. బీబీ నగర్ నుంచి భువనగిరి, రాయిగిరి, జమ్మాపూర్ వంగపల్లి వరకూ ఆటోలోనే ప్రయాణించి ఉంటాడని అనుమానిస్తున్నారు.

బస్సులు, ఆటోలతోపాటు నడుచుకుంటూ వచ్చినా సరే.. నాలుగైదు రోజుల్లో జనగామా లేదా వరంగల్ కు చేరుకుంటాడన్న అంచనాతో పోలీసులు వరంగల్, జనగామా పరిసర ప్రాంతాల్లో నిఘా ఉంచారు. ఆత్మహత్య చేసుకుంటాడేమెనన్న అనుమానంతో ఈ నెల 14,15 తేదీల్లో తూర్పు మండలం టాస్క్ ఫోర్స్ పోలీస్  బృందం, రఘునాథపల్లి, రాఘవాపూర్, చాగల్లు, స్టేషన్ ఘన్ పూర్, జనగామ పోలీసులు నిఘాను పెంచారు.

రాజు ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారం తొలుత రైల్వే పోలీసులకు తెలిసింది. తర్వాత వరంగల్ జిల్లా పోలీసులకు తెలిసినప్పటికీ హైదరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు.

ఇదిలా ఉండగా.. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్యాచారం కేసును మూసివేసేందుకు అవసరమైన ప్రక్రియను పోలీసులు చేపట్టారు. చనిపోయింది రాజేనన్న ఆధారాలన్నింటినీ సేకరించారు. అతడుంటున్న గదికి వెళ్లి వేలి ముద్రలు, సూర్యాపేటకు వెళ్లి కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం సేకరించారు. అతడు వినియోగించిన వస్తువులు, తాళం, బాలికను పూడ్చి పెట్టిన వస్త్రం, ఇతర వస్తువులను సేకరించి వాటిపై వేలి ముద్రలను తీసుకున్నారు. అతని మృతదేహం నుంచి రక్త నమూనాలను సేకరించి వాటాిపై వేలి ముద్రలను తీసుకున్నారు. అతని మృతదేహం నుంచి డీఎన్ఏ పరీక్షకు పంపించారు. ఆ పరీక్షలో ఆత్మహత్య చేసుకుంది రాజు అని తేలడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios