ప్రగతి భవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్‌ల భేటీ ముగిసింది. సుమారు 5 గంటల పాటు సాగిన సీఎంల సమావేశానికి సంబంధించిన వివరాలను ఇరు రాష్ట్రాల మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఈటల రాజేందర్ మీడియాకు తెలిపారు.

అన్నదమ్ముల్లా కలిసిమెలిసి సాగేందుకే ఈ సమావేశం ముఖ్యోద్దేశమన్నారు తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్. ఇరు రాష్ట్రాల ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని సమావేశంలో చర్చించినట్లుగా ఈటల తెలిపారు.

నీటి పారుదల సమస్యలపై సుధీర్ఘంగా చర్చించామని వెల్లడించారు. ఇరు రాష్ట్రాల్లోని మెట్ట ప్రాంతాలకు నీరు అందించే విధంగా నీటిపారుదల నిపుణులు కొన్ని సలహాలు ఇచ్చారని రాజేందర్ తెలిపారు.

ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సాగే విధానంలో కేసీఆర్ ముందువరుసలో నిలుస్తారన్నారు. ఈ సమావేశానికి కొనసాగింపుగా శనివారం కూడా ఇరురాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, ఉన్నతాధికారులు భేటీ అవుతారని ఈటల తెలిపారు.

తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఈరోజు చరిత్మాకదినమన్నారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలైనప్పుడు అనేక సమస్యలుంటాయని తెలిపారు. పాదయాత్రలో తాగు, సాగునీటి అవసరాల కోసం ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో జగన్ ప్రత్యక్షంగా చూశారని బుగ్గన గుర్తు చేశారు.

రెండు రాష్ట్రాలకు సంబంధించి షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనపై ముఖ్యమంత్రులు చర్చించినట్లు బుగ్గన తెలిపారు. నదీ జలాల వినియోగంపై జూలై 15 నాటికి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లుగా రాజేంద్రనాథ్ పేర్కొన్నారు.

నదీ జలాల విషయంలో ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలపై ఇరు రాష్ట్రాలు పోరాడాలని నిర్ణయించినట్లు బుగ్గన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా యంత్రాంగం అమరావతికి తరలివెళ్లినందున భవనాలను ఖాళీగా ఉంచడం కన్నా ఉపయోగపడతాయన్న ఉద్దేశ్యంతోనే వాటిని తెలంగాణకు అప్పగించినట్లు రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు.

రివర్ కన్జర్వేటివ్ యాక్ట్‌ ప్రకారమే ఉండవల్లి కరకట్ట వద్ద నిర్మించిన కట్టడాలపై నోటీసులు ఇచ్చామని బుగ్గన స్పష్టం చేశారు.