న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్టు, కవి కృష్ణారావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అనువాద ప్రక్రియలో ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు. ప్రముఖ డోగ్రీ కవయిత్రి పద్మా సచ్ దేవ్ రాసిన కవితల్ని తెలుగులో గుప్పెడు సూర్యుడు, మరికొన్నికవితలు పేరిట తెలుగులో అనువదించినందుకు కేంద్ర సాహిత్య అకాడమీ సోమవారం నాడు ఈ పురస్కారాన్ని ప్రకటించింది.

భారతీయ స్త్రీ  ఎదుర్కొనే  సామాజిక అన్యాయం, సుఖ దుఃఖాలతో పాటు  దేశ విభజన సమయంలో తన తండ్రిని పోగొట్టుకున్న కవయిత్రి మానసిక వేదన ఈ కవితల్లో వ్యక్తీకరించారని, కృష్ణారావు తెలుగులో వాటిని అద్భుతంగా అనువదించారని సాహిత్య అకాడమీ ప్రశంసాపత్రంలో చెప్పారు.

కృష్ణారావు కృష్ణుడిగా ప్రసిద్ధుడు. కృష్ణుడు పేరుతో ఆయన తెలుగు కవిత్వం రాస్తూ ఉంటారు. ఆయన ఇండియా గేట్ కాలమ్ తెలుగు పాఠక ప్రపంచంలో పేరెన్నిక గన్నది.

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కృష్ణారావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హర్షం వ్యక్తం చేశారు. అప్పరసు కృష్ణారావు పాత్రికేయ వృత్తిలో, సాహిత్య రంగంలో మరింత ఎదిగి రాష్ట్రానికి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు.