ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ మీద కన్నేసిందా? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. త్వరలో అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణ లో పాదయాత్ర చేపట్టనున్నట్టు తెలుస్తోంది. దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. 

ఢిల్లీ : Punjab అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి మంచి ఉత్సాహంగా ఉన్న Aam Aadmi Party ఇప్పుడు ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది చివర్లో జరిగే Gujarat, Himachal Pradesh అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. ఇదే సమయంలో దక్షిణాదిలోనూ పార్టీని విస్తరించాలని భావిస్తుంది. త్వరలోనే ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి 
Arvind Kejriwal తెలంగాణకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో కేజ్రీవాల్ హైదరాబాద్ కు రానున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పాదయాత్ర ప్రారంభించనున్నట్లు పేర్కొన్నాయి.

తెలంగాణ యువతతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల మద్దతు ఆప్ కు ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కార్యక్రమం కోసం ఆప్ ఇప్పటికే తెలంగాణా సెర్చ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోఆమ్ ఆద్మీ పాదయాత్రలు చేపట్టనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. తెలంగాణ లో వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలతోనే ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణాదిలో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. ఆప్ తెలంగాణ ఇన్చార్జిగా సోమనాథ్ భారతిని నియమించారు. త్వరలోనే ఆయన రాష్ట్రానికి వచ్చి పాదయాత్ర ఏర్పాట్లు చూడనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో 92 చోట్ల జయకేతనం ఎగురవేసింది. భగవంత మాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

కాగా, మార్చి 16న పంజాబ్ రాష్ట్రానికి 17వ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ప్రమాణ‌స్వీకారం నేప‌థ్యంలో పంజాబ్ ప్రజలను ఉద్దేశించి భ‌గ‌వంత్ మాన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఒక వీడియో విడుద‌ల చేశారు. మార్చి 16వ తేదీన భగత్ సింగ్ కలను నెరవేర్చడానికి అందరం కలిసి పనిచేస్తామని అందులో తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడి దార్శనికతకు రూపాన్ని ఇస్తామని చెప్పారు. కొత్తగా ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రజల ప్రభుత్వమని ఆయన తెలిపారు. బుధ‌వారం నాడు తాను మాత్ర‌మే కాద‌ని, త‌న‌తో పాటు పంజాబ్ లోని మూడు కోట్ల మంది ప్రజలు కూడా త‌న‌తో పాటు ప్రమాణం చేస్తార‌ని చెప్పారు.

భ‌గ‌వంత్ మాన్ ఉదయం 10:00 గంటలకు తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల‌ని పంజాబ్ ప్రజలను ఆహ్వానించారు. వేడుకలకు హాజరయ్యేందుకు వచ్చే ప్రజలు బసంతి రంగు తలపాగా లేదా కండువా ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇటీవల ముగిసిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయాన్నిసొంతం చేసుకుంది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 117 స్థానాలకు గాను 92 స్థానాల్లో ఘ‌న విజ‌యం సాధించింది. భ‌గ‌వంత్ మాన్ ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు.