హైదరాబాద్: ఈ నెల 18వ తేదీన మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మేరకు జీఎడీ, ప్రోటోకాల్ శాఖలకు సీఎఓ నుండి సోమవారం నాడు ఆదేశాలు జారీ చేశారు. తొలి విడతలో కేసీఆర్ తన మంత్రివర్గంలోకి ఎనిమిది మందిని తీసుకోనున్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన రెండోసారి ప్రమాణం చేశారు. ఆ రోజున తనతో పాటు మహమూద్ అలీని మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. మహమూద్ అలీకి హోంమంత్రిత్వశాఖను కేటాయించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 18వ తేదీన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. తొలి విడతలో కేసీఆర్ ఎనిమిది మందిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు.
ఈ ఎనిమిది మందిలో ఎవరెవరికీ చోటు దక్కుతోందనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 17వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం‌కు చెందిన ముంతాజ్ అహ్మద్ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయనున్నారు. అయితే స్పీకర్ పదవి ఈటల రాజేందర్‌ పేరు ప్రధానంగా ప్రచారంలో ఉంది.

గత టర్మ్‌లో మంత్రులుగా కొనసాగిన వారిలో  కేటీఆర్, హరీష్‌రావులతో పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటల రాజేందర్‌లలో ఎవరో ఒకరిని కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉందంటున్నారు. వీరితో పాటు గత టర్మ్‌లో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన పద్మా దేవేందర్ రెడ్డి ఈ దఫా తప్పకుండా మంత్రివర్గంలోకి చాన్స్ దక్కనుందనే ప్రచారం సాగుతోంది.

ఇక కొత్తగా నలుగురికి చాన్స్ దక్కనుంది. వేముల ప్రశాంత్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డిలకు ఛాన్స్ దక్కనుందని సమాచారం.
అయితే ఈటల రాజేందర్ స్పీకర్  పదవిని తీసుకోవడానికి సుముఖంగా లేడనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయమై కేసీఆర్  చివరి నిమిషంలో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకొంటారా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఈ నెల 18వ తేదీన మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని సీఎంఓ నుండి జీఏడి, ప్రోటోకాల్ శాఖలకు సోమవారం సాయంత్రం ఆదేశాలు  అందాయి. ఈ నెల 18వ తేదీన మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.