హైదరాబాద్: రైతు బంధు పథకానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కోత విధించనున్నారు. రైతుకు ఉన్న అన్ని ఎకరాలకు రైతు బంధు పథకాన్ని అమలు చేస్తూ వస్తున్న కెసిఆర్ ప్రభుత్వం దాన్ని పది ఎకరాలకు తగ్గించాలని యోచిస్తోంది. రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా సరే పది ఎకరాలకు మాత్రమే రైతు బంధు కింద పెట్టుబడి ఇవ్వాలని వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

తన ప్రతిపాదనలను వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి కెసీఆర్ ఆమోదం కోసం పంపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక మాంద్యం నేపథ్యంలో దాన్ని వచ్చే రబీ నుంచి లేదా ఆ తర్వాత వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

నిబంధనల్లో మార్పు చేసినా రైతు బంధు కింద ప్రతి రైతుకు పెట్టుబడి సొమ్ము అందుతుందని, ఎక్కువ భూములు ఉన్న రైతులకు కూడా పది ఎకరాలకు పెట్టుబడి సొమ్ము ఇస్తామని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. అయితే, కేసీఆర్ ఆ ప్రతిపాదనకు అంత సుముఖంగా లేరని అంటున్నారు. 

ఎంత భూమి ఉన్నా సరే అంతటికీ ఇస్తామని హామీ ఇచ్చామని, మాట తప్పకూడదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు చెబుతున్నారు. పది ఎకరాల సీలింగ్ అమలు చేస్తే ఏడాదికి దాదాపు రూ.2 వేల కోట్ల వరకు మిగులుతాయని, దాంతో పలు శాఖల్లో అమలు చేస్తున్న పథకాలకు నిధులు అందించడానికి వెసులుబాటు కలుగుతుందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నట్లు తెలుస్తోంది. 

నిరుడు ఖరీఫ్ సీజన్ నుంచి కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు చేస్తోంది. ఖరీఫ్, రబీకి కలిపి నిరుడు కేసీఆర్ ప్రభుత్వం ఎకరానికి 8 వేల రూపాయల చొప్పున రైతులకు పెట్టుబడి సొమ్ము అందించింది. 53 లక్షల మంది రైతులకు 10 వేల కోట్ల రూపాయలు చెల్లించింది. 

ఈ ఏడాది నుంచి ఎకరానికి రెండు సీజన్లకు కలిపి రూ. 10 వేల రూపాయల చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. అందుకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో రూ. 12 వేల కోట్లు కేటాయించింది. ఆ మేరకు ఖరీఫ్ లో ఎకరాకు రూ. 5వేల చొప్పున అందిస్తోంది. ఇప్పటి వరకు 40 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4,400 కోట్లు జమ చేసింది. మరో 14 లక్షల మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ. 2 వేల కోట్లు జమ చేయాల్సి ఉంది.