హైదరాబాద్‌:  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ఉదయం  ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.. ఢిల్లీలో ఆయన మూడు రోజులపాటు ఉంటారు. రాష్ట్రానికి  కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయమై ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కేసీఆర్ కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్  సీఎంఓ వర్గాలు కోరాయి. అయితే పీఎంఓ నుండి గురువారం నాడు రాత్రి వరకు మోడీ అపాయింట్ మెంట్ ఖరారు కాలేదని సమాచారం.  

రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. మరో వైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తో కూడ ఆయన సమావేశం కానున్నారు.

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతు సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.ఈ ఆందోళనలకు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది.  రైతు సంఘాల నేతలతో కూడ కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి కేంద్రం స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. గతంలో ఈ స్థలాన్ని తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. 

ఈ స్థలంలో టీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన విషయమై సీఎం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.ఆదివారం నాడు రాత్రి లేదా సోమవారం నాడు ఉదయం కేసీఆర్ హైద్రాబాద్ కు తిరిగి వస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.