Asianet News TeluguAsianet News Telugu

రెండో సారి అధికారం చేపట్టాక తొలి బంద్ ను ఎదుర్కోనున్న కెసిఆర్

రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తరువాత కెసిఆర్ తొలి సమ్మెను ఎదుర్కొంటున్నారు. తొలి బంద్ ను కూడా ఫేస్ చేయనున్నారు. ఆర్టీసీ జేఏసీ ఈ నెల 19వ తేదీన తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే

kcr to face first bandh after becoming cm for the second time
Author
Hyderabad, First Published Oct 13, 2019, 1:37 PM IST

హైదరాబాద్: రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తరువాత కెసిఆర్ తొలి సమ్మెను ఎదుర్కొంటున్నారు. తొలి బంద్ ను కూడా ఫేస్ చేయనున్నారు. ఆర్టీసీ జేఏసీ ఈ నెల 19వ తేదీన తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. శనివారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి నేడు ఆదివారం రోజు చికిత్స పొందుతూ మరణించాడు. దీనితో రేపు సోమవారం నాడు ఖమ్మం జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు.ఈ రెండు బంద్ లకు అన్ని విపక్షాలు, ప్రజాసంఘాలు తమ మద్దతు తెలిపాయి. 

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం స్థాయికి ఈ బంద్ ను తీసుకెళ్తామని అఖిలపక్షం ప్రకటించింది. ఇదిలా ఉండగా, సమ్మె వల్ల ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా విద్యాసంస్థలకు సెలవులను వారం రోజులపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. 

ఈ నెల 21నుండి విద్యాసంస్థలు ప్రారంభం అవనున్న నేపథ్యంలో, అప్పటికల్లా ఆర్టీసీని పూర్వ స్థితికి చేర్చాలని కెసిఆర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అవసరమైనన్ని బస్సులను పూర్తిస్థాయిలో సమకూర్చుకోవడంలో అధికారులు తలమునకలై ఉన్నారు. 

సమ్మెలో పాల్గొన్న వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగితీసుకునేది లేదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. సమ్మెకు దూరంగా ఉన్నవారికి మాత్రమే సెప్టెంబర్ నెల జీతాలను ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 

తెలంగాణ లో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య ఒక మహా యుద్ధమే నడుస్తున్నా విషయం తెలిసిందే. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు మరో 26 డిమాండ్లపై ఆర్టీసీ జేఎసి నేతలు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. విధుల్లోకి రాకపోతే డిస్మిస్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం చెప్పినట్టుగానే దాదాపు 48వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్టు ప్రకటించింది. 

ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా రాపర్తి నగర్ కు చెందిన డ్రైవర్ భీంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దాదాపు 90శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతు మరణించాడు.    

Follow Us:
Download App:
  • android
  • ios