న్యూఢిల్లీ: దిశ రేప్, హత్య ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పెదవి విప్పలేదు. ఆయన స్పందన కోసం ఢిల్లీలో జర్నలిస్టులు తీవ్రంగా ప్రయత్నించారు. రెచ్చిగొట్టే విధంగా ప్రశ్న వేసినా ఆయన స్పందించలేదు. వెటర్నరీ డాక్టర్ కుటుంబ సభ్యులను ఎందుకు కలవలేదని జర్నలిస్టులు అడిగినా ఆయన స్పందించలేదు.

ఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే కేసీఆర్ పై జర్నలిస్టులు ప్రశ్నల వర్షం కురిపించారు. "సార్, ఓ వివాహానికి హాజరయ్యేందుకు మీరు ఢిల్లీ వచ్చారు, కానీ సైబరాబాద్ బాధిత కుటుంబానికి చెందినవారిని కలవడానికి మీకు సమయం లేకుండా పోయింది" ఓ జర్నలిస్టు వ్యాఖ్యానించినా కేసీఆర్ మాట్లాడలేదు. 

జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నా పట్టించుకోకుండా మౌనంగా వెళ్లిపోయారు. వివాహ వేడుకలో కూడా కేసీఆర్ వద్దకు వెళ్లడానికి రిపోర్టర్లు ప్రయత్నించారు. కానీ సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.

మోడీని కలవకుండానే...

ఢిల్లీలో వివాహానంతర వేడుకకు హాజరైన కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కలవకుండానే హైదరాబాదు తిరిగి వచ్చారు. మంగళవారం రాత్రి ఆయన హైదరాబాదు చేరుకున్నారు. ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ రాజీవ్ శర్మ కుమారుడి వివాహానంతర వేడుకలో పాల్గొనడానికి ఆయన ఢిల్లీ వచ్ాచరు. 

రెండు మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో మకాం వేసి ప్రధానిని కలుస్తారంటూ వార్తలు వచ్చాయి. రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగులో ఉన్న విషయాలపై ఆయన మోడీతో చర్చిస్తారని భావించారు