హుజూర్ నగర్: హుజూర్ నగర్ లో భారీ వర్షం పడుతోంది. దీంతో హుజూర్ నగర్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బహిరంగ సభ ఏర్పాట్లకు అంతరాయం ఏర్పడింది. హుజూర్ నగర్ లో తమ టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు కేసీఆర్ శనివారం ఈ బహిరంగ సభను తలపెట్టారు. 

కేసీఆర్ ప్రచారానికి వెళ్లడానికి ఖరారు చేసుకున్న రోజు కూడా హుజూర్ నగర్ లో భారీ వర్షం పడింది. దీంతో ఆయన తన ఎన్నికల ప్రచార సభను రద్దు చేసుకున్నారు. హెలికాప్టర్ దిగడానికి ఏవియేషన్ అనుమతి ఆయనకు లభించలేదు. ఈ రోజు శనివారం మాత్రం ఆయన హైదరాబాదు నుంచి బయలుదేరారు. 

హుజూర్ నగర్ లో కేసీఆర్ శనివారం సాయంత్రం బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉండింది. ఆయన సభ జరుగుతుందా, లేదా అనేది వాతావరణంపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. హుజూర్ నగర్ శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి కాంగ్రెసు అభ్యర్థి పద్మావతి రెడ్డిపై 43 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 

ఆ విజయం తర్వాత కేసీఆర్ హైదరాబాదులో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు ధన్యవాదాలు తెలపడానికి తాను శనివారం హుజూర్ నగర్ వస్తున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా టీఆర్ఎస్ నేతలు ఆయన బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. తీరా సమయానికి భారీ వర్షం పడుతోంది. 

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లోకసభకు ఎన్నికైన తర్వాత హుజూర్ నగర్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాంతో హుజూర్ నగర్ శాసనసభకు ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఓటమి పాలైన సైదిరెడ్డి టీఆర్ఎస్ బరిలోకి దింపగా, కాంగ్రెసు తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి పోటీ చేశారు.